
‘ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక’
కామారెడ్డి క్రైం: పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, ఎంపీడీవో లతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇసుక రవాణా గురించి ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక ఉచితంగా ఇస్తామని, రవాణా ఖర్చులు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లభ్యత ఉన్నచోటు నుంచి ఇసుకను పొందవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మొరం అవసరమైన వారు పంచాయతీ కార్యదర్శి సిఫారసుతో ట్రాక్టరుకు రూ.300, టిప్పర్‌కు రూ.1,200 చొప్పున డీడీ రూపంలో చెల్లించి మొరం అనుమతులు పొందాలన్నారు. కిష్టాపూర్, హస్గుల్, కుర్ల, ఖద్గావ్, శెట్లూర్ ఇసుక క్వారీ లకు పర్యావరణ అనుమతుల చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆర్డీవోలు, మైనింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ విక్టర్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.