
సమస్యలకు పరిష్కారం దొరికేనా?
కామారెడ్డి టౌన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. జీజీహెచ్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ఐదేళ్లలో ఆరుసార్లే..
అస్పత్రి అభివృద్ధి, సమస్యలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదేళ్లలో ఆరుసార్లు మాత్రమే సమావేశం నిర్వహించారు. ఏరియా ఆస్పత్రిని జీజీహెచ్‌గా మార్చి మూడేళ్లవుతోంది. జీజీహెచ్‌గా మారాక తొలిసారి సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం.
కలెక్టర్ అధ్యక్షతన..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి సంబంధించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు. అస్పత్రిలోని మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు తెలిపారు. హెచ్‌డీఎస్ చైర్మన్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి సభ్యులైన ఎంపీ, జిల్లాలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించామని పేర్కొన్నారు.
కామారెడ్డి జీజీహెచ్ భవనం
ఆస్పత్రి నిండా సమస్యలే..
నిధులు పక్కదారి..
ఆస్పత్రికి సంబంధించి ఆరోగ్యశ్రీ నిధులు రూ. 70 లక్షలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. ఆరోగ్య బీమా పథకం(ఆబా) నిధులు రూ. 20 లక్షలు, ఏఆర్‌టీ నిధులు రూ. 10 లక్షలు, డయాలసిస్ నిధులు రూ. 10 లక్షలను హెచ్‌డీఎస్ అనుమతి లేకుండానే వినియోగించారు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. గతంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా పనిచేసిన అధికారితోపాటు ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి వైద్యుడు, ఓ సీనియర్ డాటా ఆపరేటర్‌లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ సిబ్బంది జీతాలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నిధులు వినియోగం అక్రమాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో గత ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సంజాయిషీ నోటీసు అందజేసినట్లు తెలిసింది. తాజాగా రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరిన అధికారి సైతం ఆ నిధుల వివరాలు, వినియోగం చిట్టా చూసి అవాక్కయినట్లు సమాచారం. ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
కమిటీ ఇలా..
నేడు జీజీహెచ్ అభివృద్ధి
కమిటీ సమావేశం
ఆస్పత్రి చరిత్రలో తొలిసారి
నిర్వహణకు ఏర్పాట్లు
పాల్గొననున్న ఎమ్మెల్యేలు
నిధుల పక్కదారిపై
చర్చించే అవకాశం
జీజీహెచ్ హెచ్‌డీఎస్ చైర్మన్‌గా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, వైస్ చైర్మన్‌గా ఆస్పత్రి సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు, సభ్యులుగా ఎంపీ సురేశ్ షెట్కార్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు ఉన్నారు. సభ్యులుగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు ఉండాలి. వారి పేర్లను ఇంకా కమిటీలో చేర్చలేదు.
జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో వంద పడకల ఏరియా ఆస్పత్రిగా ఉన్న భవనాన్ని డీఎంఈ పరిధిలోకి తీసుకుని 330 పడకలతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)గా మార్చారు. ఇందులో 32 విభాగాలున్నాయి. అయితే భవనం ఇరుకుగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్కింగ్‌కు సరిపడా స్థలం లేదు. తీవ్రమైన నీటి సమస్య ఉంది. అస్పత్రి మార్చురి రోడ్డు అధ్వానంగా ఉంది. భవనం పాతది కావడంలో వర్షం పడితే నీరు ఊరుస్తోంది. అక్కడక్కడ పీవోపీ ఊడి పడుతోంది. ఓపీ విభాగాల గదులు ఇరుకుగా మారాయి. పాత భవనం పక్కన రేకుల షెడ్డులో చీకటిలో రక్తపరీక్షల నమూనాలను సేకరిస్తున్నారు. గర్భిణులకు వైద్య సేవలను పాత ఆయుష్ భవనం గదుల్లో అందిస్తున్నారు. సరిపడా స్థలం లేకపోవడతో ఆరుబయట గర్భిణులు, మహిళలు నిల్చోవాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ఎలక్ట్రికల్ వైరింగ్ వ్యవస్థ సరిగా లేక సామగ్రి చెడిపోతోంది. ప్లంబింగ్ సమస్యలూ ఉన్నాయి. మెటర్నిటీ వార్డులో పైకప్పునుంచి పీవోపీ పడిపోవడంతో ఆ గదిలో పాత సామగ్రిని ఉంచారు. జనరల్ వార్డులో మెటర్నిటీ సేవలు అందిస్తున్నారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన భవన లిఫ్ట్ నెల రోజుల నుంచి పని చేయడం లేదు.