
లిఫ్టు సదుపాయం కల్పిస్తే సహకరిస్తాం
నిజాంసాగర్(జుక్కల్): నాలుగు గ్రామాలకు లిఫ్టు సదుపాయం కల్పిస్తేనే మంజీరా నదిపై నాగమడుగు ఎత్తిపోతల పనులకు సహకరిస్తామని రైతు నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగమడుగు ఎత్తిపోతల పైపులైన్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద స్థానిక రైతులు, నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. పంపుహౌస్‌తో పాటు పైపులైన్ పనుల్లో భూములు కోల్పోతున్న వడ్డేపల్లి, మల్లూర్, జక్కాపూర్ గ్రామాల భూనిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలన్నారు. అంతే కాకుండా ఆయా గ్రామాలతో పాటు గిరిజన తండాల పరిధిలోని 2,593 ఎకరాల భూములకు లిఫ్టు ద్వారా సాగు నీరు అందించాలని కోరారు. నాయకులు ప్రదీప్ పటేల్, పెద్ది అంజయ్య, గౌస్, శ్రీనివాస్, రవీందర్‌సేట్, అంజయ్య తదితరులున్నారు.