
మత్తుకు బానిసవుతున్న బాల్యం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ‘బాల్యం’ మత్తుకు బానిసవుతోంది. చెడువ్యసనాలకు అలవాటు పడి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్య నేర్పిస్తున్న గురువులు ప్రయత్నిన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. టీచర్లపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దండిస్తే తల్లిదండ్రులుతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో టీచర్లు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
గౌరవం లేకుండా పోయింది..
ఒకప్పుడు దారిలో విద్య నేర్పిన గురువులు కనిపిస్తే ఎదురెళ్లి వినయంగా రెండు చేతులు జోడించి నమస్కరించే వారు. టీచర్లు దండించడం వల్లే తాము మంచి ప్రయోజకులం అయ్యామని అప్పటి విద్యార్థులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఇందుకు కొంత మంది తల్లిదండ్రుల తీరే కారణమని స్పష్టమవుతోంది. చదవకపోతే దండించినా, పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను బెదిరించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
నైతిక విలువలపై అవగాహన కల్పించాలి..
పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువల పట్ల కనీస అవగాహన కల్పించాలి. చదువుపై దృష్టి సారించేలా చూడాలి. సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో వారికి వివరించాలి. జీవితమంటే సరదాలు, షికార్లు కాదని చెప్పాల్సిన అవసరముంది. లక్ష్యాలను నిర్దేశించుకొని విద్యార్థులను గమనిస్తూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి.
మొగ్గలోనే తుంచేస్తే మేలు..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల మంచి చెడులు గమనించి వారితో సమయం గడిపే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేకపోవడంతో వారు పక్కదారి పట్టేందుకు అవకాశం ఏర్పడుతోంది. పిల్లల కోసం రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. వారి దినచర్యను గమనిస్తూ ఉండాలి. ఖర్చులకు ఇస్తున్న డబ్బులు ఎక్కువగా దేని కోసం ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని పసిగట్టాలి. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసైనట్లు తెలిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాల్సిందే..
● ఇంట్లో తరచూ డబ్బులు పోతుండటం
● ఏదైనా ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పడం, చిరాకు పడటం, ఫోన్‌లో మునిగిపోవడం, ఒంటరిగా గడపడం
● నిద్రలేమి, కళ్లు ఎర్రగా మారి రెప్పల కింద గుంతలు ఏర్పడటం, పెదవులు పొడిగా మారడం, శరీర పరిశుభ్రత పాటించకపోవడం.
● రోజురోజుకు బలహీనంగా మారడం
చెడు వ్యసనాలకు అలవాటు పడి
జీవితాలు నాశనం
వద్దని వారిస్తే తిరగబడుతున్న వైనం
అవగాహన కల్పిస్తున్నాం
పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. మద్యం, బెల్టు దుకాణాలపై నిఘా పెట్టాం. మైనర్లకు మద్యం, సిగరెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో సైబర్ డ్రగ్స్ వంటి కేసులపై అవగాహన కల్పిస్తున్నాం.మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం, రవాణాను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకుంటాం.
– పుష్పరాజ్, ఎస్సై, సదాశివనగర్
డ్రగ్స్‌తో ఆరోగ్యానికి హానికరం
సిగరెట్ల వల్ల క్యాటరాక్ట్ వినికిడి శక్తి కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నోరు ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి.
– ఆస్మా అప్షిన్, వైద్యాధికారిణి, సదాశివనగర్

మత్తుకు బానిసవుతున్న బాల్యం

మత్తుకు బానిసవుతున్న బాల్యం