అక్కడ అంతా ఓపెన్‌! | - | Sakshi
Sakshi News home page

అక్కడ అంతా ఓపెన్‌!

Jul 17 2025 3:38 AM | Updated on Jul 17 2025 3:38 AM

అక్కడ

అక్కడ అంతా ఓపెన్‌!

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయాలతో పాటు చెక్‌పోస్టులు, చెక్‌ పాయింట్ల వద్ద వసూళ్ల దందా ఓపెన్‌గా నడుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా చూశారు. ఇటీవల 161 వ నంబరు జాతీయ రహదారిపై సలాబత్‌పూర్‌ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ట్రాన్స్‌పోర్టు వాహనాల డ్రైవర్లు వచ్చి గల్లాపెట్టె(బాక్సు)లో డబ్బులు వేసి వెళుతుండడాన్ని గమనించారు. తాజాగా బుధవారం ఉదయం 44 వ నంబరు జాతీయ రహదారిపై పొందుర్తి వద్ద ఉన్న రవాణాశాఖ చెక్‌పాయింట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో అక్కడ ప్రైవేటు వ్యక్తులు దర్జాగా డబ్బులు వసూలు చేస్తుండడాన్ని గుర్తించారు.

మొన్న సలాబత్‌పూర్‌.. నేడు పొందుర్తి..

రవాణా శాఖ చెక్‌పోస్టులు, కార్యాలయాల్లో ఏళ్లుగా వసూళ్ల దందా నడుస్తుండగా.. అప్పుడప్పుడు ఏసీబీ దాడులు చేయడం, తరువాత యథావిధిగా దందా నడవడం పరిపాటైంది. గతనెల 26న సలాబత్‌పూర్‌ చెక్‌పోస్టుపై దాడి చేసిన సమయంలో లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చెక్‌పోస్టు దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళుతుండడాన్ని గమనించారు. ఆ రోజు లభించిన లెక్కకు రాని డబ్బులు రూ. 91 వేలను సీజ్‌ చేశారు. తాజాగా పొందుర్తి చెక్‌పాయింట్‌ వద్ద లెక్కచూపని రూ. 80 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో రద్దీగా ఉండే 44 వ నంబరు జాతీయ రహదారిపైనున్న ఈ చెక్‌పాయింట్‌నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వాహనాలను ఆపకుండా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలంటే ఈ చెక్‌ పాయింట్‌లో మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇక్కడ ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకుని లారీలు, ట్రక్కులు లాంటి రవాణా వాహనాల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది.

అంతా ‘మామూలే’..

రవాణాశాఖ కార్యాలయాలు, చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్లపై ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. సలాబత్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద ఏసీబీ దాడి జరిగిన మరుసటి రోజు నుంచే వసూళ్లు యథావిధిగా కొనసాగాయి. పొందుర్తి చెక్‌పాయింట్‌ వద్ద కూడా ఇది ‘మామూలు’గా మారింది. అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ వసూళ్లకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయన్న అభిప్రాయం ప్రజలనుంచి వ్యక్తమవుతోంది.

బహిరంగంగా వసూళ్లు..

ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ప్రైవేటు సైన్యం

ఏసీబీ అధికారుల కళ్ల ముందే

వసూళ్ల దందా

దాడులు జరుగుతున్నా ఆగని అవినీతి

రవాణా శాఖ కార్యాలయాలతో పాటు చెక్‌పోస్టులు, చెక్‌ పాయింట్ల వద్ద బహిరంగంగా వసూళ్లు చేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు.. ఇంకా వాహనాలకు సంబంధించిన ప్రతి పనికో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లై చేసుకున్న వారు కార్యాలయానికి వెళితే ఏదో ఒక సాకు చెప్పి పనులు చేయడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఏజెంట్ల వ్యవస్థ లేదని అధికారులు చెబుతున్నా, అక్కడ ఏజెంట్ల రాజ్యమే కొనసాగుతోంది. సాయంత్రానికి లెక్కగట్టి ఏజెంట్లు అధికారులకు డబ్బులు అప్పజెబుతున్నారు. చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్ల వద్ద సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు డబ్బులు ఇవ్వడం బహిరంగంగానే జరుగుతోంది. అయితే రవాణా శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా డబ్బులు తీసుకోకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు.

అక్కడ అంతా ఓపెన్‌!1
1/1

అక్కడ అంతా ఓపెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement