
పెద్దపులి జాడెక్కడ!
● మూడో రోజూ కొనసాగిన
గాలింపు చర్యలు
● అడవిని జల్లెడ పడుతున్నా
లభించని ఆచూకీ
● నలుగురి అరెస్ట్, రిమాండ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి జాడ కోసం అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ మూడో రోజూ కొనసాగింది. ఎస్ 12 నంబరుగల పులి తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. దాని జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు బృందాలు రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పులి కదలికలను కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. కనీసం దాని కదలికలు దొరికినా అటువైపు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పులి ఏ ప్రాంతంలో పశువులపై దాడి చేసిందో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల అడవిలో ఉన్న లోయలు, గుట్ట ల్లో గాలింపు కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు ఎప్ప టికప్పుడు తెలుసుకుంటున్నారు. మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికై తే సఫలం కాలేదని అటవీ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నలుగురు నిందితుల అరెస్టు
అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడడం, వన్య మృగాలను చంపడానికి ప్రయత్నించిన నేరాలపై రామారెడ్డి మండలంలోని స్కూల్ తండాకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బూక్య మహిపాల్, గంగావత్ కన్నీరాం, సలావత్ గోపాల్, పిపావత్ సంజీవ్‌లను అరెస్టు చేసినట్టు జిల్లా అటవీ అధికారి నిఖిత తెలిపారు. వారికి 14 రోజుల రిమాండు విధించినట్లు వివరించారు.