
చదువులు సాగేదెలా?
నస్రుల్లాబాద్: దుర్కిలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల/పాఠశాలలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో బోధన ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది వరకు 5, 6, 7 తరగతులు ఉండగా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8వ తరగతికి అప్‌గ్రేడ్ అయ్యింది. మొత్తం 440 సీట్లు ఉండగా ప్రస్తుతం 348 మంది అడ్మిషన్లు పొందారు. ఇందులో ఇంటర్‌లో 55 మంది విద్యార్థినులున్నారు. మిగిలినవారు పాఠశాల విద్యార్థులు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు బోధించడానికి 20 మంది టీచర్లు అవసరం. అయితే ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాల విద్యలో మాథ్స్, సైన్స్, సోషల్‌తోపాటు ఇంగ్లిష్ బోధించేవారు లేరు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్ట్‌లు రెండు ఖాళీగా ఉన్నాయి. కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పోస్టు సైతం ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన కెమిస్ట్రీ అధ్యాపకురాలు ఇటీవల హాస్టల్‌లో విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఈ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. దీంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేక నష్టపోతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
పాఠశాలలో అధ్యాపకుల కొరత ఉంది. ఈ విషయాన్ని పలుమార్లు ఆర్‌సీవో దృష్టికి తీసుకువెళ్లాం. వారు నోటిఫికేషన్ వేస్తామంటున్నారు.
– శ్యామలాదేవి, ప్రిన్సిపల్,
సాంఘిక సంక్షేమ పాఠశాల
పనిభారంతో ఒత్తిడి..
చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పార్ట్‌టైం ఉద్యోగులపై పనిభారం పడుతోంది. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల పాఠశాలలో రాత్రి విధులు నిర్వహించిన కెమిస్ట్రీ లెక్చరర్ మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మరణించినప్పటినుంచి రోజూ నలుగురు టీచర్లకు నైట్ డ్యూటీలో ఉంటున్నారు. రోజు విడిచి రోజు నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుండడంతో పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుర్కి సంక్షేమ బాలికల
విద్యాలయంలో సగం పోస్టులు ఖాళీ
ముందుకు సాగని బోధన
నష్టపోతున్న విద్యార్థినులు

చదువులు సాగేదెలా?