
నికాల్‌పూర్‌కు మరో పేరు లక్ష్మీనారాయణపురం
మీకు తెలుసా?
మండలంలో ముంపు గ్రామమైన నికాల్‌పూర్‌కు లక్ష్మీనారాయణపురం అనే మరో పేరు కూడా ఉంది. మరికొందరు జంగంపల్లి అని కూడా పిలిచేవారట. ●
● సుమారు 155 ఏళ్ల క్రితం పంటలకు, పశువులకు నీటి కొరత ఉందనే కారణంతో లక్ష్మీనారాయణపురం గ్రామస్తులందరూ గోదావరి ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్లకు భూములు ముంపునకు గురికావడంతో ఎత్తయిన ప్రాంతానికి వచ్చి ఇళ్లను నిర్మించుకున్నారు.
● ఇలా పలుమార్లు వారి భూములు ముంపునకు గురికావడంతో ప్రతిసారి వారు వేరే ఎత్తయిన ప్రాంతానికి వచ్చి నివాసాలను ఏర్పాటుచేసుకున్నారు.
● మూడుసార్లు గ్రామస్తులు ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవడంతోనే లక్ష్మీనారాయణపురం గ్రామానికి నికాల్‌పూర్ అనే పేరు వచ్చినట్లు ఊరి పెద్దలు చెప్తున్నారు. నికాల్ అంటే హిందీలో వెళ్లిపోవడం అని అర్థం.
● ప్రస్తుతం గ్రామంలో 534 నివాస గృహాలు, 1200 ఎకరాల సాగుభూమి ఉంది.
● నికాల్‌పూర్ మొదటి గ్రామ సర్పంచ్‌గా ఆనంద్‌రావు 1969లో పని చేశారు.
● గ్రామంలో జంగం చెరువు, ఊర చెరువు, కొత్తకుంట అనే మూడు చెరువులు ఉన్నాయి. పాత గ్రామంలో ఓ కాలనీకి వేంకటేశ్వర పల్లె అనే పేరు ఉండేది. దానికి గుర్తుగా గ్రామస్తులు ఇటీవల ఊరి నడిబొడ్డున వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు.
● పాత గ్రామంలోని హనుమాన్ ఆలయం ప్రతీ ఏటా వర్షాకాలంలో ముంపునకు గురై వేసవిలో తేలుతుంది. అప్పుడు ఊరంతా వెళ్లి పూజలు నిర్వహిస్తారు.
– డొంకేశ్వర్(ఆర్మూర్)
సమాచారం..
ఆర్మూర్: భారతదేశంలో నేరస్తులకు శిక్షలు విధించడానికి, నేరస్తుల విచారణ కోసం బ్రిటీష్ కాలంలో రూపొందించబడిన చట్టాలే 2024 వరకు కొనసాగాయి. శిక్షలు విధించడానికి 1860లో ఐపీసీ(ఇండియన్ పీనల్ కోడ్), 1973లో సీఆర్పీసీ(క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), 1872లో ఐఈఏ(ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్)లను రూపొందించారు.
● ఈ చట్టాలను సవరిస్తూ 2023 డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం చేసింది.
● ఐపీసీని బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత)గా, సీఆర్పీసీని బీఎన్‌ఎస్‌ఎస్ ( భారతీయ నాగరిక్ సురక్షా సంహిత)గా సవరించింది. అలాగే ఐఈఏని బీఎస్‌ఏ(భారతీయ సాక్ష్య అధినియం)గా మారుస్తూ 2024 జూలై 1నుంచి అమలులోకి తీసుకొచ్చారు.
● ప్రస్తుతం పోలీస్‌స్టేషన్లలో నమోదు చేయబడ్డ వివిధ కేసులపై నూతన చట్టం ఆధారంగా కోర్టుల్లో విచారణ చేపట్టి సాక్ష్యాల ఆధారంగా న్యాయమూర్తులు నేరస్తులకు శిక్షలను ఖరారు చేస్తున్నారు.
● ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్‌ఎస్‌లో 358 సెక్షన్లకు కుదించారు.
● సీఆర్పీసీలో 484 సెక్షన్లు ఉండగా బీఎన్‌ఎస్‌ఎస్‌లో 531 సెక్షన్లకు పెంచారు.
● ఐఈఏలో 167 సెక్షన్లు ఉండగా బీఎస్‌ఏలో 170 సెక్షన్లకు పెంచారు.