
సంక్షిప్తం
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
దోమకొండ: తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం దోమకొండ దేశాయి బీడీ కంపెనీ మేనేజర్‌కు సమ్మె నోటీసును అందజేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు తెలిపారు. బహుజన వామపక్ష కార్మిక సంఘాల భాగస్వామ్య కార్మిక సంఘాలు జేఏసీల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య, ప్రతినిధులు శంకర్,మారుతి,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు,
గిరిజన మండల కార్యవర్గం ఎన్నిక
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని బంజారా సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా జాదవ్ దేవీదాస్, గౌరవ అధ్యక్షుడి మెగావత్ గోపాల్, ఉపాధ్యక్షులు మాలోత్ భద్రు, మాలోత్ భీమా, దేవసోత్ దేవిసింగ్, ప్రధాన కార్యదర్శి దేవసోత్ సర్వన్, సహయ కార్యదర్శులుగా బదావత్ నౌషా, బదావత బలరాం, రమావత్ విజయ్, రమావత్ పాండు, కోశాధికారి బానోత్ మోతీరాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బనావత్ శ్రీనివాస్, మోతీసింగ్, ఆయా తండాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.
విఠలేశ్వరాలయంలో ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి విఠలేశ్వరుడి ఆలయంలో శనివారం ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాలలో భాగంగా విఠలేశ్వరుడు, రుక్మిణి పాండురంగనికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి భక్తులు కాకడ హారతి, పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నాగభూషణం, ప్రణయ్‌కుమార్ శర్మ తదితరులున్నారు.
ముస్తాబైన బైరాపూర్ విఠలేశ్వర ఆలయం
బాన్సువాడ : తొలి ఏకాదశి పురస్కరించుకుని రుక్మిణి విఠలేశ్వర ఆలయాలు ముస్తాబయ్యాయి. బీర్కూర్ మండలం బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర మందిరానికి శనివారం నుంచే భక్తుల తాకిడి ప్రారంభమైంది. ఆలయ కమిటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్త ద్రోణవల్లి సతీష్ తెలిపారు.

సంక్షిప్తం