
ధరణి నిండా సమస్యలే!
● సర్కారు టౌన్‌షిప్‌లో ప్లాట్లు
విక్రయించి రెండున్నరేళ్లు
● ఇప్పటికీ మౌలిక వసతులు
కల్పించని ప్రభుత్వం
● మోసపోయామంటున్న
ప్లాట్లు కొనుగోలు చేసినవారు
● సౌకర్యాలు కల్పించాలని వినతి
కామారెడ్డి అర్బన్ : ధరణి టౌన్‌షిప్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, జనాలను ఆకర్షించి ప్లాట్లు విక్రయించిన పాలకులు.. ఆ తర్వాత దాని ఊసే మరిచిపోయాయి. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2009 సంవత్సరంలో కామారెడ్డిలోని44న నంబర్ జాతీయ రహదారి పక్కన రాజీవ్ స్వగృహ ఏర్పాటు చేశారు. ప్రస్తుత కలెక్టరేట్ సమీపంలో అడ్లూర్ శివారు 501/3 సర్వే నంబర్‌లో 50.29 ఎకరాల విస్తీర్ణంలో 40 అడుగుల ప్రధాన రోడ్లు, 30 అడుగుల అంతర్గత రోడ్లతో వివిధ పరిమాణాల్లో మొత్తం 543 ప్లాట్లు చేశారు. 313 ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 230 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్ల కోసం అప్పట్లో అసక్తిగలవారినుంచి డీడీలు తీసుకున్నారు. అయితే రాజశేఖరరెడ్డి మరణానంతరం ఇళ్ల నిర్మాణం మరుగున పడింది. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అప్పట్లో రాజీవ్ స్వగృహలో ఇళ్ల కోసం డీడీలు చెల్లించినవారికి మూడేళ్ల క్రితం డబ్బులు వాపస్ ఇచ్చారు. రాజీవ్ స్వగృహను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్లాట్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, అడవిలా మారింది.
అందమైన బ్రోచర్లు ముద్రించి..
గత ప్రభుత్వం వృథాగా ఉన్న రాజీవ్ స్వగృహను 2022లో కాస్త అభివృద్ధి చేసి ధరణి టౌన్‌షిప్‌గా పేరు మార్చింది. అందమైన బ్రోచర్ ముద్రించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఐదు విడతల్లో ప్లాట్లను విక్రయించింది. సర్కారే ఎలాంటి హామీ లేకుండా ప్లాట్ల మార్టిగేజ్‌తో కెనరా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించింది. టౌన్‌షిప్‌లోని ప్లాట్లను వేలం వేయడం ద్వారా సర్కారుకు సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. వేలం వేసిన తర్వాత టౌన్‌షిప్‌ను నిర్లక్ష్యం చేసింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, కనీస మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆవేదన చెందుతున్నారు. అందమైన బ్రోచర్లు, హామీలతో సర్కారు మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ధరణి టౌన్‌షిప్‌లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇటీవల టౌన్‌షిప్ బాధితులు సమావేశమై వెంచర్ వరకు ర్యాలీ తీశారు. సౌకర్యాలు కల్పించకపోతే ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టౌన్‌షిప్ అభివృద్ధికి దాదాపు రూ. 14 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారని, సర్కారు వెంటనే నిధులు మంజూరు చేయాలని ‘ధరణి’ బాధితుల సంఘం ప్రతినిధి రాజనర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. టౌన్‌షిఫ్‌లో ఇంకా 14 ఎకరాలు ఖాళీగా ఉందని, అభివృద్ధి చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరో రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయని, దీనిని పరిశీలించాలని కోరారు.

ధరణి నిండా సమస్యలే!