
అంధకారంలో పట్టణం
సిరిసిల్లరోడ్‌లో వెలగని లైట్లు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో వీధీ దీపాలు, ప్రధాన రోడ్లపై సెంట్రల్ లైటింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో కొన్ని కాలనీల్లో సాయంత్రం కాగానే చీకట్లు అలుమకుంటున్నాయి. కాలనీలతో పాటు ప్రధాన రోడ్లపైనా పలుచోట్ల వీధిదీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్‌కు బకాయిలను చెల్లించకపోవడంతో నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఏడాది దాటినా..
కామారెడ్డి బల్దియాలో 500లకుపైగా కాలనీలున్నా యి. లక్షకుపైగా జనం నివసిస్తున్నారు. పట్టణంలో ప్రధాన రోడ్లపై డివైడర్‌లలో ఏర్పాటు చేసిన 890 విద్యుత్ దీపాల నిర్వహణ బల్దియానే చూసుకుంటుంది. కాలనీలలో 12,434 వీధి దీపాలు ఉండగా వీటి నిర్వహణ బాధ్యతను ఈఎస్‌ఎన్ అనే కంపెనీ కి టెండర్ ద్వారా అప్పగించారు. ప్రతినెలా వీటి ని ర్వహణకు రూ. 10 లక్షలకుపైగా కంపెనీకి చెల్లించా ల్సి ఉంటుంది. అయితే మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ. 3.40 కోట్లకు చేరాయి. బకాయిల భారం పెరగడంతో కాంట్రాక్ట్ పొందిన సంస్థ వీధిదీపాల నిర్వహణను గాలికి వదిలేసింది. పాడైపోయినవాటి స్థానంలో నూతన దీ పాలను కొనుగోలు చేయకపోవడంతో చాలా కాలనీలలో వీధిదీపాలు వెలగక రాత్రి వేళలో అంధకా రం అలుముకుంటోంది. శివారు కాలనీలలో పరిస్థి తి మరింత దారుణంగా ఉంది.
సమస్య పరిష్కరిస్తాం
పట్టణంలో వీధి దీపాల నిర్వహణ కంపెనీకి బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరలో చెల్లిస్తాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమస్యను నివేదిస్తున్నాం. త్వరలో నూతన విద్యుత్ దీపాలను కొనుగోలు చేస్తాం. సమస్య ఉన్న కాలనీలలో వాటిని బిగిస్తాం. – రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
సెంట్రల్ డివైడర్‌లలోనూ..
ప్రధాన రోడ్లపై సెంట్రల్ డివైడర్‌లలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను బల్దియా చూసుకుంటోంది. అయితే నిర్వహణను బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంతో హౌజింగ్‌బోర్డు, మున్సిపల్ కార్యాలయం ముందు, రైల్వే బ్రిడ్జి, సిరిసిల్లరోడ్, స్టేషన్‌రోడ్, టేక్రియాల్ రోడ్, దేవునిపల్లి రోడ్‌లలో చాలావరకు లైట్లు వెలగడం లేదు. దీంతో పట్టణంలోని చాలాచోట్ల రాత్రి వేళలో చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోంది.
అధ్వానంగా వీధి దీపాల నిర్వహణ
ఏడాదినుంచి బల్బుల కొరత..
కాలనీల్లో వెలగని లైట్లు
పట్టించుకోని అధికారులు

అంధకారంలో పట్టణం

అంధకారంలో పట్టణం