
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
భిక్కనూరు/సదాశివనగర్: సదాశివనగర్ మండలం కల్వరాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల రాంచంద్రం (48) మృతి చెందాడు. రాంచంద్రం నిజామాబాద్‌లోని తన కుమార్తె ఇంటికి బోనాల పండుగకు వెళ్లి తిరిగి భిక్కనూరుకు వస్తుండగా కల్వరాల వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రాంచంద్రం అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
పశువుల కాపరి మృతదేహం లభ్యం
మాక్లూర్: చెరువులోకి చొరబడిన గేదెలను బయటకు తీసే క్రమంలో శనివారం సాయంత్రం గుత్ప చెరువులో ప్రమాదవశాత్తు మునిగి గల్లంతైన పశువుల కాపరి బాబన్న (60) మృతదేహాం ఆదివారం లభించింది. మాక్లూర్ పోలీసుల కఽథనం మేరకు వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాబన్న అతని భార్య కలిసి గ్రామస్తులందరి గేదెలను కూలీ లెక్కన మేపుతారు. రోజూ మాదిరిగానే శనివారం సాయంత్రం గేదెలను గ్రామంలోనికి తెచ్చే ముందు నీరు తాగించేందుకు సమీపంలో ఉన్న చెరువులోనికి దించాడు. అవి ఎంతకూ బయటికి రాకపోవటంతో బాబన్న చెరువులోనికి దిగి వాటిని బయటకు తీసే క్రమంలో మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న మాక్లూర్ పోలీసులు శనివారం సాయంత్రం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం బాబన్న శవం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లైన్‌మన్‌పై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
రెంజల్(బోధన్): విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన తనపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని రెంజల్ లైన్‌మన్ శ్రీనివాస్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆదేశాల మేరకు సాటాపూర్ గ్రామంలో కరెంట్ బిల్లులను వసూలు చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన మన్మథ స్వామి, మన్మథ మహేశ్ అనే వ్యక్తులు దురుసుగా మాట్లాడుతూ చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. రెంజల్ శివారులోని వారి పొలంలో అక్రమంగా స్తంభాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో ఏఈ ఆదేశాల మేరకు కరెంట్ కనెక్షన్ తొలగించినట్లు తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకొని తనపై దాడి చేసి గాయపర్చారని పేర్కొన్నారు.
పొలంలోకి దూసుకెళ్లిన కారు
బోధన్: పట్టణ శివారు నుంచి రాయ్‌కూ ర్ గ్రామానికి వెళ్లే మార్గంలో ఆదివారం స్థానిక కర్నె రాజశేఖర్ అనే రైతు వరి నాటు వేసిన పొలంలోకి కారు దూసుకెళ్లిందని పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఏడుగురు వ్యక్తులు ఆకతాయి చేష్టలు చేస్తూ అతివేగంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో కారు పంట పొలంలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. వరి పంటకు నష్టం జరిగిందని రైతు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరి మృతి