
కారులో వచ్చి.. హిజ్రాల ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం: కారులో వచ్చిన దుండగులు తాళం వేసి ఉన్న హిజ్రాల ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలోని ఓ ఇంట్లో కొందరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు. వారు శనివారం రాత్రి సెకండ్‌షో సినిమాకు వెళ్లారు. 10.45 గంటల ప్రాంతంలో హిజ్రాల ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హిజ్రాలు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. చోరీకి పాల్పడిన దుండగులు ఓ కారులో వచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లో దాచి ఉంచిన 7 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.