
రైతు వేదిక.. భారం కాదిక
ఎల్లారెడ్డి: ప్రారంభించిన నాటి నుంచి నిర్వహణకు ఎలాంటి నిధులు మంజూరు కాక, వ్యవసాయ శాఖకు గుదిబండలుగా మారిన రైతు వేదికల దశ తిరగనుంది. రైతు వేదికలపై సోలార్ ప్లాంటులను ఏర్పాటు చేసి వాటికి సాలీనా రూ.25 వేల వార్షికాదాయం వచ్చేలా ప్రభుత్వం పథక రచన చేయనుంది. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వ్యవసాయ అధికారులు తక్షణం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ఏర్పాటుకు నడుం కట్టింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా గుర్తించి ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మాణం చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో ఈ క్రమంలో 104 రైతు వేదికలను నిర్మించారు. రైతు వేదికల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కోసం ఒకే ఒక మారు నిధులు మంజూరైనట్లు తెలిసింది. నాటి నుంచి నేటి వరకు నిర్వహణ నిధులు రాక రైతు వేదికలు వ్యవసాయ విస్తరణాధికారులకు(ఏఈవో) భారంగా మారాయి. రైతు వేదికల నిర్వహణలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విద్యుత్ బిల్లుల చెల్లింపులు. నిర్వహణ నిధులు రాకపోవడంతో రైతు వేదికలలో ఏళ్ల తరబడి విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం పథకం కోసం రైతు వేదికల విద్యుత్ బకాయిల చెల్లింపునకు కొద్దో గొప్పో నిధులు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిసింది. రైతు వేదికల నిర్వహణ ఖర్చులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా వాటికి సోలార్ ప్లాంటులను అమర్చి స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన కింద రైతు వేదికలతో పాటు మార్కెట్‌యార్డులు, రైతు బజార్లలోనూ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది యంత్రాంగం. ప్రతి రైతు వేదికపై 5 కిలో వాట్ల సోలార్ ప్లాంట్ అమర్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సోలార్ యూనిట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో వేదిక అవసరాలకు వాడుకుని మిగితా విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు అమ్ముకుని ఆదాయం పొందేలా ప్రభుత్వం పథకం సిద్ధం చేస్తోంది. విద్యుత్ శాఖకు మిగులు విద్యుత్ అమ్మడం ద్వారా ఏటా రూ.25 వేల వార్షికాదాయం రైతు వేదికలకు కలుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేయనున్న ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవేశపెట్టారని అధికారులు అంటున్నారు.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా
ఆదాయం సమకూర్చుకునేందుకు
ప్రణాళికలు
ఆ దిశగా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో
పైలట్ ప్రాజెక్టు అమలు
విధి విధానాలు రావాల్సి ఉంది
రైతు వేదికలను స్వయం సమృద్ధి పరిచేందుకు వాటిపై సోలార్‌యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు యూనిట్లు ఏర్పాటు చేశారు. త్వరలో రెడ్కో అధికారులతో అనుసంధానం చేసి యూనిట్ల ఏర్పాటుకు వ్యూహ రచన చేస్తున్నారు.
– తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయ
అధికారి, కామారెడ్డి