
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 2024–25 సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. సక్రమంగా పనిచేసిన కూలీలకు తక్కువ డబ్బులు ఇప్పించడం, పనులకు రాని కూలీలకు డబ్బులు వచ్చేలా చేయడం, మస్టర్లలో సరిగా కూలీల హాజరు వేయకపోవడం వంటి తప్పులు జరిగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీ ఆర్‌డీవో సురేందర్ మాట్లాడుతూ.. నిధులను పక్కదారి పట్టించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, డబ్బులను రికవరీ చేస్తామన్నారు. ఎర్రాపహాడ్ ఫీల్డు అసిస్టెంటు బాలురాజును సస్పెండ్ చేశారు. మండల ప్రత్యేక అధికారి శివకుమార్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, ఎస్‌ఆర్పీ సాంబశివచారీ, ఇన్‌చార్జి ఏపీవో కృష్ణ గౌడ్, జీపీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డు అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి టౌన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక కోసం ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎస్.రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి జులై 13 వరకు https://national awardstoteachers.education.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక మార్గదర్శకాల కోసం ఎంహెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్ https://www.education.gov.in ను సంప్రదించాలన్నారు.
లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలి
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ఎంపీడీవో ముజాహిద్ అన్నారు. బోర్లం గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ముజాహిద్ పర్యటించారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తికాగానే రూ.లక్ష బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తామన్నారు. పంచాయతి కార్యదర్శి సాయికుమార్ ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరూ వెంటనే పనులు ప్రారంభించాలని హన్మాజీపేట్ పంచాయతీ కార్యదర్శి రాజేష్ అన్నారు. గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఖాళీ స్థలంలో ముగ్గుపోసి భూమిపూజ చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. మాజీ సర్పంచ్ బోనాల సుభా ష్, నాయకులు వడ్ల శేఖర్, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.