
ఇంటిగ్రేటెడ్ లేట్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం గురుకు ల విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అన్ని కులాల విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునేలా సమీకృత గురుకులాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు నిర్మించి ప్రారంభించాలని ని ర్ణయించింది. తొలి విడతలో జిల్లాలోని జుక్కల్ ని యోజక వర్గానికి స్కూల్ మంజూరైంది. మద్నూర్ మండల కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు నిర్మించేందుకు గతేడాది డిసెంబర్ 7న అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు, సౌకర్యాల కల్పన కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశారు. ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదలయ్యాయి. నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాల నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అలాగే రెండో విడతలో ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాలకు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో లింగంపేట మండలం మోతె గ్రామంలో, బాన్సువాడ నియోజక వర్గానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పరిధిలో స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలుబడ్డాయి. ఇక మిగిలింది కామారెడ్డి నియోజకవర్గం మాత్రమే. మరో విడతలో కామారెడ్డికి మంజూరవుతుందని భావిస్తున్నారు.
నెలలు గడుస్తున్నా..
మద్నూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడిచాయి. ఇప్పటికీ టెండర్లు కూడా పూర్తవలేదు. తొలి విడతలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు మంజూరైన ఇతర జిల్లాల్లో టెండర్లు పూర్తవడం గమనార్హం. రెండేళ్లలో భవనాల నిర్మాణం పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించాలన్నది సర్కారు లక్ష్యం. అయితే మద్నూర్‌లో ఇంకా టెండర్ల దశ కూడా దాటలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. తర్వాత కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ అగ్రిమెంట్ ప్రాసెస్‌కు కూడా సమయం పడుతుంది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నో ఆశలు..
అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకునేలా కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్కూల్‌పై ఆశలు పెట్టుకున్నారు. అందులో సీటు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నారు.
తొలివిడతలో జుక్కల్
నియోజక వర్గానికి మంజూరు
శంకుస్థాపన చేసి ఆరు నెలలు..
ఇప్పటికీ టెండర్ల దశ దాటని ప్రక్రియ