
‘పౌర హక్కులను కాలరాసిన ఘనత కాంగ్రెస్‌దే’
కామారెడ్డి టౌన్: భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు నియంత పాలన సాగించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయమన్నారు. ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించారని విమర్శించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన రోజు దేశమంతా చీకటితో నిండిన రోజని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ వ్యాఖ్యానించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర నాయకులు మురళీధర్‌గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నాయకులు వేణు, రవీందర్, లింగారావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.