
‘అటవీ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం’
పెద్దకొడప్‌గల్: అటవీ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించబోమని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత హెచ్చరించారు. కాటేపల్లి తండా శివారులో అటవీ భూములు కబ్జా అవుతున్న విషయమై ఈనెల 2న సాక్షిలో ప్రచురితమైన కథనంపై డీఎఫ్‌వో నిఖిత స్పందించారు. శుక్రవారం ఆక్రమణకు గురైన అటవీ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ భూముల జోలికి వెళ్లవద్దన్నారు. కాటేపల్లి తండా శివారులో అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఆ భూమిలో త్వర లో అటవీశాఖ తరఫున మొక్కలు నాటేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం తండా వాసులు మాట్లాడుతూ తమ తండా పరిధిలో అటవీ భూములను ఫారెస్ట్ అధికారులు గుర్తించిన విధంగానే ఇతర ప్రాంతాలలో కూడా కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటేనే తాము కబ్జా చేసిన భూములను వదులుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారి సునీత, పిట్లం ఎఫ్‌ఆర్‌వో రవికుమార్, కౌలాస్ డీఆర్‌వో అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.