
మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ తనిఖీ
● మెడికల్ కళాశాల, జీజీహెచ్‌ను
సందర్శించిన బృందం
● మొక్కుబడిగా ముగించారని విమర్శలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం గురువారం తనిఖీ చేపట్టింది. కమిటీ ఇన్‌చార్జి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) రవీందర్ నాయక్, సభ్యులు కలెక్టర్ అశిష్ సంగ్వాన్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్‌తో పాటు అధికారులు మధ్యాహ్నం మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. మెడికల్ కళాశాల, హస్టల్ భవనాల పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి అప్పగించాలని ఇంజినీర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు, పరికరాలు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనంగా మరో 100 పకడలతో హాస్టల్ నూతన భవనం కావాలని కామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ డీపీహెచ్‌ను కోరారు.
గైర్హాజరైన సూపరింటెండెంట్
ఎంసీఎంసీ బృందం తనిఖీ సమయంలో జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫరీదా గైర్హాజయ్యారు. ఉదయం హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసిన ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయారు. ఆరోగ్యశ్రీ నిధులు హెచ్‌డీఎస్ కమిటీ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వినియోగించారని, ఈ వ్యవహారంలో కల్టెకర్ సూపరిండెంట్‌పై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనిఖీ సమయంలో ఉంటే ఉన్నతాధికారులకు విషయం తెలిసిపోతుందనే ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయారని ఆస్పత్రి సిబ్బంది, కొంత మంది వైద్యులు గుసగుసలాడారు.
40 నిమిషాల్లోనే..
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి చేరుకున్న బృందం.. సాయంత్రం 4.20 నుంచి 4.35 మధ్య తనిఖీ చేసింది. ల్యాబ్, ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం సూపరింటెంటెండ్ చాంబర్‌లో వైద్యాధికారులతో 4.38 నిమిషాలకు సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 5 గంటలకు బయటకు వచ్చిన బృందం సభ్యులు 5 గంటల 6 నిమిషాలకు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. రోగులతో మాట్లాడకపోవడం, ఆస్పత్రి ఆవరణను పరిశీలించకపోవడంతో మొక్కుబడిగా తనిఖీ ముగించారని పలువురు విమర్శించారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ చందర్‌నాయక్, టీఎంఎస్‌ఐడీసీ నిజామాబాద్ ఈఈ కుమార్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, వైద్యులు ఉన్నారు.