
తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా
మాచారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిని, తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.9వేలకోట్ల రైతు భరోసా ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండల కేంద్రంలోని శివబాలాజీ ఫంక్షన్ హాలులో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ మురుగన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, పరిశీలకులు కత్తి వెంకటస్వామి, సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పేదల కోసం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని, ధనికులు తినే సన్న బియ్యం పేదలకు అందించి వారి కడుపు నింపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్టానికి చేసిందేమీ లేదని షబ్బీర్ అలీ ఘాటుగా విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చూస్తోందన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పాత నాయకులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
కులగణన దేశానికి ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ అన్నారు. రేవంత్‌రెడ్డి దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా చేసి చూపించారని అన్నారు. ఎంపీ సురేశ్ షెట్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అనుబంధ సంఘాల మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి
నియోజకవర్గానికి
3,500 ఇందిరమ్మ ఇళ్లు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ