
ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలానికి చెందిన సీడీసీ చైర్మన్ మహ్మద్ ఇర్షాదుద్దీన్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్‌లో క్రియాశీల కార్యకర్తగా పని చేస్తూ, ఎమ్మెల్యేగా మదన్‌మోహన్‌రావు గెలుపు కోసం కష్టపడ్డానని లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా తనలాంటి నాయకులను అవమానిస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులకు కీలక భాద్యతలు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏల పెత్తనంతో విసిగిపోయానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్‌అలీని గానీ, మరే ఇతర నాయకులను గానీ కలిస్తే చాలు తమ దగ్గరకు రావొద్దని ఆంక్షలు పెడుతున్నారని, వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏల వ్యవహారాన్ని ఎమ్మెల్యే మదన్‌మోహన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
అప్పట్లో రామారెడ్డి మండల నేతలు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అప్పట్లో పీఏల పెత్తనంపై ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు ఇప్పటికీ ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా సదాశివనగర్ మండలానికి చెందిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
పార్టీకి సీడీసీ చైర్మన్ ఇర్షాద్ రాజీనామా
ఎమ్మెల్యే పీఏల పెత్తనంపై మండిపాటు