
ఇసుక పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారులకు ఇసుక ఇవ్వకుండా పక్కదారిపట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. తహసీల్, మున్సిపల్ కార్యాలయాలను గురువారం ఆమె సందర్శించారు. సబ్ కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. 10 ట్రాక్టర్ల ఇసుకకు ఒకేసారి పర్మిట్లు ఇస్తున్నారని, స్థలం లేక రెండు, మూడు ట్రాక్టర్ల ఇసుక తాము వేసుకుంటుండగా, మిగతా ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి కమిషనర్ ఖయ్యూంను ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా.. ఆరుగురు సిబ్బంది కొత్తగా విధుల్లో చేరారని, వార్డు అధికారులతోపాటు మరి కొంత మంది సిబ్బంది అవసరం ఉందని కమిషనర్ సమాధానమిచ్చారు. సిబ్బంది నియామకంతోపాటు ఇతర అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్ కలెక్టర్ అన్నారు.