
గుంతల రోడ్డుకు మోక్షం
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): ఒకప్పుడు రోడ్డు వెంబడి నడవాలంటే ప్రజలు నరకయాతన అనుభవించారు. ఎన్నికల్లోనే ఈ రోడ్డు గురించి చర్చ జరిగేది.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మర్చి పోయేవారు. గత 40 ఏళ్లుగా మెటల్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఇరు గ్రామాల ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందిస్తూ వచ్చారు. అయినా సమస్య తీరలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కొన్ని రోజులుగా విన్నపాలు అందిస్తూ వచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే స్పందించి మెటల్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడానికి ఎన్ని నిధులు అవసరపడతాయో సంబంధిత అధికారులను ఆదేశించి నివేదికను తెప్పించుకున్నారు. మండలంలోని వజ్జపల్లి, ఉత్తనూర్ గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.కోటి 30 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులకు ఇటీవల ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గతంలో ఈ రోడ్డు వెంబడి పాదచారులు నడవాలంటే ఇబ్బందికరంగా ఉండేది. తరచూ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి కింద పడడంతో గాయాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇరు గ్రామాలకు దూర భారం తగ్గనుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లుగా అవస్థలు పడ్డ గ్రామస్తులు
బీటీ రోడ్డు నిర్మాణం కోసం
రూ.కోటి 30 లక్షలు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న
ఇరు గ్రామాల ప్రజలు
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం
గత పాలకులు బీటీ రోడ్డు నిర్మిస్తామని ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు దండుకుంటూ అధికారంలోకి రాగానే ఆ రోడ్డు మాట పక్కన పెట్టేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన మదన్మోహన్రావు గత ఎన్నికల్లో రోడ్డు నిర్మాణం చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాడు. ఎమ్మెల్యేకు ప్రజలు రుణపడి ఉంటారు. రోడ్డు నిర్మాణంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది
– హరీష్ రావు, వజ్జపల్లి
ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేది
ఎన్నికలు రాగానే ప్రచారానికి వచ్చే ప్రజాప్రతినిధులకు మా రోడ్డు గుర్తుకు వచ్చేది. మేము గెలవగానే రోడ్డును బాగు చేయిస్తాం అంటూ మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునేవారు. ఆ తర్వాత రోడ్డు మాటే మర్చిపోయేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు ప్రత్యేక దష్టి సారించి రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. – కలిగోట స్వామి, వజ్జపల్లి

గుంతల రోడ్డుకు మోక్షం

గుంతల రోడ్డుకు మోక్షం