
ప్రేమ వ్యవహారంలో బెదిరింపులు: యువకుడి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఒంటర్‌పల్లి గ్రామంలో ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించగా, విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాపర్తి సాయిలు–అంజవ్వ దంపతులకు ఓ కూతురు, కొడుకు శ్రీకాంత్(21) ఉన్నారు. వారం రోజుల క్రితం కూతురును తీసుకొని దంపతులిద్దరూ హైదరాబాదుకు బతుకుదెరువు కోసం వెళ్లారు. కొడుకు ఒక్కడే ఒంటర్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన యువతి మామ శ్రీకాంత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తన కొడుకు ఆత్మహత్యకు కారణం యువతి కుటుంబ సభ్యులే అని శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. గ్రామానికి ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్రావు, పోలీసులు చేరుకొని ఇరువర్గాల వారిని సముదాయించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.