
ఉపాధి అవకాశాలుండే విద్య అవసరం
తెయూ(డిచ్‌పల్లి): స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్‌తోపాటు ఉపాధి అవకాశాలుండే విద్య అవసరమని, అలాంటి విద్యా విధానం అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (టీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ కాలేజ్ సెమినార్ హాల్‌లో ‘వికసిత్ భారత్–2047, ట్రాన్స్‌ఫార్మటివ్ రోల్ అఫ్ కామర్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల ద్వారా సరైన మార్గదర్శనం చేయడానికి యూనివర్సిటీలు కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చూస్తున్నారని, ఆయన ఆశయాలను మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన విద్య ఉన్న వారికి సముద్ర అంతర్భాగాల నుంచి ఆకాశం వరకు అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంతో పోటీపడే విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. తెయూ వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంతో కో–ఆపరేటివ్ ఫెడరలిజం వల్ల అవినీతి తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సదస్సు కార్యదర్శి రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ.. జాతీయ సదస్సులో మానవ వనరుల నిర్వహణ, అకౌంటింగ్, ఆర్థికం, మార్కెటింగ్, పన్నులు, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, బిగ్ డేటా, ఆటోమేషన్‌పై పరిశోధకులు, విద్యావేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి విచ్చేసి పత్ర సమర్పణ చేసినట్లు తెలిపారు. విదేశాల నుంచి 4, భారత్‌లోని 8 రాష్ట్రాల నుంచి 174 పత్రాలు వచ్చినట్లు తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఈ) డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పురుషోత్తమరావు, అధ్యక్షుడు చెన్నప్ప, జనరల్ సెక్రెటరీ రవికుమార్ జాస్తి, రిజిస్ట్రార్ యాదగిరి ప్రసంగించారు. అనంతరం సదస్సులో ‘వికసిత్ భారత్–2047, ట్రాన్స్‌ఫార్మటివ్ రోల్ అఫ్ కామర్స్’ సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, సదస్సు కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్లు గంగాధర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు కృషి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల వసతులు ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెయూలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు, ఫ్యాకల్లీ ఉందన్నారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరిలతో కలిసి తాను క్యాంపస్‌లోని భవనాలను, వసతి సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే యూజీసీ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని యూజీ, పీజీ కళాశాలల్లో 20 శాతం స్కిల్ బేస్‌డ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇతర టెక్నికల్ కోర్సులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కిల్ (నైపుణ్యం) అత్యంత అవసరమని, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉన్నట్లే థర్డ్ లాంగ్వేజ్ ఇకనుంచి స్కిల్ కోర్సులు ఉండాలని ఆయన వివరించారు. అలాగే కళాశాలలు కంపెనీలతో ఎంవోయూ చేసుకుని ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నారు. సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని, ఇందుకు వేర్వేరు రెగ్యులేటరీ కమిటీలు అనుమతులు అవసరమన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి
చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
తెయూలో ‘వికసిత్ భారత్–2047’
జాతీయ సదస్సు

ఉపాధి అవకాశాలుండే విద్య అవసరం