నస్రుల్లాబాద్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమ వారం దుర్కి గిరిజన గురుకుల బాలికల పాఠ శాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో అకస్మాత్తుగా మరణించిన స్వప్న మరణానికి సంతాపం తెలిపారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే 108కు ఫోన్ చేయాలన్నారు. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సూపర్ వైజర్‌ను ఆదేశించారు. ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, తదితరులున్నారు.
ఇసుక ట్రాక్టర్ల తనిఖీలు
బిచ్కుంద(జుక్కల్): ఇందిర మ్మ ఇళ్ల కోసం ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్లు ప్రయివేటు వ్యక్తులకు ఇసుక అమ్మ కుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా పోలీస్ అధికారులు సోమవారం బిచ్కుందలో తనిఖీలు చేపట్టారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘ఇసుక మేమే సరఫరా చేస్తాం..’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందిచారు. ఎస్సై మోహన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు వెళ్తున్నాయా లేదా అని ట్రాక్టర్లను ఆపి వేబిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆ గ్రామ ట్రాక్టర్ల యజమానులు ఇతర మండలాల ట్రాక్టర్లను క్వారీలోకి రాకుండా అడ్డుకుంటున్న విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల సహకారంతో ఇతర మండలాల ట్రాక్టర్లకు ఇసుక కోసం వే బిల్లులు ఇస్తామని తెలిపారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్
మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇసుక అవసరం ఉన్నవారు అధికారుల అనుమతితోపాటు ట్రాక్టర్లకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి