
అధికారుల సంతకాలు ఫోర్జరీ
● కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి క్రైం: విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన వ్యవహారంలో ఓ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. కే రవి కుమార్ అనే కానిస్టేబుల్ ఇటీవలే బదిలీపై దేవునిపల్లి పీఎస్‌కు వచ్చాడు. ఇది వరకు పెద్దకొడప్‌గల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏఎస్సై సంతకాలు ఫోర్జరీ చేసి బస్సు వారంట్లను దుర్వినియోగం చేశాడు. విధులకు గైర్హాజరు కావడం, బదులుగా ఎస్సై సంతకాన్ని ఫోర్జరీ చేసి పై అధికారులకు నివేదికలు పంపించాడు. పలు విషయాల్లో రవికుమార్‌పై ఆరోపణలు రావడంతో బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి విచారణ జరిపి ఎస్పీ రాజేశ్‌చంద్రకు నివేదిక సమర్పించారు. దీంతో రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీయూసీఐ రాష్ట్ర
అధ్యక్షుడిగా సూర్యం
నిజామాబాద్ సిటీ: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర తొలి మహాసభ విజయవంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కే సూర్యం, కార్యదర్శిగా ఎస్‌ఎల్ పద్మ, ఉపాధ్యక్షులుగా ఎం నరేందర్, ఎం హన్మేష్, జీ రామయ్య, కే రాజన్న, సీ వెంకటేశ్, సహాయ కార్యదర్శిగా ఎం వెంకన్న, ముత్తన్న, వీ ప్రవీణ్, అరుణ్ కుమార్, యాకుబ్ షావలి, కోశాధికారిగా కిరణ్, సభ్యులుగా 26 మందిని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 15 తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణలోని కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని, పీఎఫ్, పెన్షన్ రూ.9వేలు చెల్లించాలని. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం నరేందర్, సహాయ కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం వెంకన్న, జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేశ్వర్, మల్లేశ్, జిల్లా నాయకులు కిరణ్, రవి, సాయన్న తదితరులు పాల్గొన్నారు.