డిపో స్థలం వేదికగానే హామీలు.. | - | Sakshi
Sakshi News home page

డిపో స్థలం వేదికగానే హామీలు..

Jun 24 2025 3:49 AM | Updated on Jun 24 2025 3:49 AM

డిపో

డిపో స్థలం వేదికగానే హామీలు..

ఎల్లారెడ్డి బస్‌ డిపో కోసం సేకరించిన స్థలం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఎల్లారెడ్డి పట్టణం మధ్యలో ఉంటుంది. ఎల్లారెడ్డి మీదుగా జాతీయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తయితే ఎల్లారెడ్డి పట్టణం మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి. డివిజన్‌ కేంద్రమైన ఎల్లారెడ్డి పట్టణానికి నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌, లింగంపేట, గాంధారి తదితర మండలాల నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. చుట్టుపక్కల మండలాల ప్రజలు జుక్కల్‌ ప్రాంతంతోపాటు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు వెళ్లాలంటే ఎల్లారెడ్డిని దాటాల్సిందే.. ఈ ప్రాంతంలో బాన్సువాడ, మెదక్‌, హైదరాబాద్‌ల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులన్నీ ఎల్లారెడ్డి గుండానే తిరుగుతాయి. ఎల్లారెడ్డికి చుట్టుపక్కల వందలాది గ్రామాలున్నాయి. ఎల్లారెడ్డి బస్టాండ్‌ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది.

డిపో లేక.. బస్సులు తిరగక...

ఎల్లారెడ్డిలో బస్‌ డిపో లేకపోవడంతో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండాపోయింది. కొన్ని రూట్లలో కామారెడ్డి డిపో బస్సులు, మరికొన్ని రూట్లలో బాన్సువాడ డిపో బస్సులు నడుస్తున్నాయి. అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఇప్పటికీ బస్సు నడవని గ్రామాలు ఎన్నో ఉండడం గమనార్హం. ఇతర డిపోల అధికారులు ఎల్లారెడ్డి గ్రామాలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా బస్‌ డిపో ఉంటే చుట్టుపక్కల గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా బస్సులు నడిపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పర్యటనతో మళ్లీ ఆశలు..

ఎల్లారెడ్డి పట్టణంలో బస్‌ డిపో ఏర్పాటు కోసం రెండున్నర దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేశారు. ఏడు ఎకరాల స్థలం సేకరించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రతి ఎన్నిక సందర్భంలోనూ ఎల్లారెడ్డిలో బస్‌ డిపో ఏర్పాటు అంశం తెరమీదికి వస్తుంటుంది. నాయకులు హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత మర్చిపోవడం షరామామూలుగా మారిపోయింది. చాలామందికి బస్సు డిపో ఏర్పాటవుతుందన్న ఆశ కూడా పోయింది. ఎన్నో ఏళ్లుగా బస్‌ డిపో పేరుతో ఓట్లు దండుకున్నారు తప్ప డిపో ఏర్పాటు చేయడం లేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా బస్‌ డిపోలు రావడం లేదంటూ తప్పించుకున్నారని, పొరుగు జిల్లాల్లో బస్‌ డిపోలు ఏర్పాటవుతున్న విషయాన్ని గుర్తుచేస్తే ఏవేవో కారణాలు చెబుతారని పేర్కొంటున్నారు. బస్‌ డిపో ఏర్పాటు కోసం ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విన్నవించారు. ఎల్లారెడ్డిలో బస్టాండ్‌ ప్రారంభోత్సవానికి మంగళవారం రవాణా శాఖ మంత్రి వస్తుండడంతో మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురించాయి. బస్‌ డిపో ఏర్పాటు చేసి ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతున్నారు.

ఎల్లారెడ్డిలో బస్‌డిపో ఏర్పాటు అంశం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. డిపో ఏర్పాటు అన్నది కాంపౌండ్‌ వాల్‌కే పరిమితమైంది. రెండున్నర దశాబ్దాలు దాటినా అడుగులు ముందుకు పడకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం ఎల్లారెడ్డి బస్టాండ్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వస్తున్న నేపథ్యంలో డిపో అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.

నేడు ఎల్లారెడ్డి బస్టాండ్‌ ప్రారంభోత్సవం

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో రూ. 4.25 కోట్ల మున్సిపల్‌ నిధులతో నిర్మించిన నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి హైదరాబాద్‌ నుంచి మెదక్‌ వరకు హెలికాప్టర్‌లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎల్లారెడ్డికి చేరుకుంటారని పేర్కొన్నారు.

పాతికేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిన అంశం

నెరవేరని ఎల్లారెడ్డి ప్రజల ఆకాంక్ష

నేడు రవాణాశాఖ మంత్రి పొన్నం రాక

డిపో ప్రకటించాలని కోరుతున్న నియోజకవర్గవాసులు

బస్‌ డిపో ఏర్పాటు కాకపోవడంతో దానికోసం సేకరించిన ఏడెకరాల స్థలం ఖాళీగా ఉంటోంది. దీంతో ఆ స్థలాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ పార్టీల సభలకు, అధికారిక సభలకు ఉపయోగించుకుంటున్నారు. ఆ స్థలం వేదికగానే ఎందరో నాయకులు ఎల్లారెడ్డిలో బస్‌ డిపో ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలు కాకపోవడం గమనార్హం.

బస్‌డిపో ఏర్పాటు చేయాలి

ఎల్లారెడ్డిలో బస్‌డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. డిపో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వం స్పందించి డిపో ఏర్పాటు చేయాలి.

– చింతకుంట బాలయ్య, ఎల్లారెడ్డి

ఇబ్బందులు తీరుతాయి

నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బాన్సువాడ, కామారెడ్డి, బోధన్‌, మెదక్‌ డిపోల బస్సులే ఆధారం. ఆ బస్సులు వచ్చేంతవరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఎల్లారెడ్డిలో డిపో ఉంటే రవాణా ఇబ్బందులు తీరుతాయి.

– ఒడ్డె నర్సింలు, ఎల్లారెడ్డి

డిపో స్థలం వేదికగానే హామీలు..1
1/2

డిపో స్థలం వేదికగానే హామీలు..

డిపో స్థలం వేదికగానే హామీలు..2
2/2

డిపో స్థలం వేదికగానే హామీలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement