
మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
కామారెడ్డి టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు, అనుబంధ బోధనాస్పత్రుల అభివృద్ధి, అత్యుత్తమ సేవలు అందేలా చూసేందుకు మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఆయా కళాశాలల్లో తనిఖీలు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
కమిటీలో ఎవరున్నారంటే..
నిజామాబాద్, కామారెడ్డి మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ ఇన్‌చార్జిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) రవీందర్ నాయక్‌కు బాధ్యతలు అప్పగించారు. తనిఖీ కమిటీలో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్‌లకు చోటు కల్పించారు. వీరు ఆయా జిల్లాల పరిధిలో బాధ్యులుగా ఉంటారు. కమిటీ సభ్యులుగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిజామాబాద్ ఈఈ కుమార్‌లను నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి 29 మధ్య కమిటీ ప్రతినిధులు ఆయా కళాశాలల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఇబ్బందులు, లోపాలు, సమస్యలపై నివేదికలను సిద్ధం చేసి ఈనెల 30న ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది. తనిఖీలలో భాగంగా కళాశాలకు కావాల్సిన యాక్షన్ ప్లాన్‌ను కూడా రూపొందించనున్నారు. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల నిర్వహణ తీరుపై ఎన్‌ఎంసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మానిటరింగ్ కమిటీల పర్యవేక్షణలో కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆరు అంశాలపై తనిఖీలు..
ప్రధానంగా ఆరు అంశాలపై ఈ కమిటీ దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి అంశంలో మౌలిక సదుపాయాలు, భవనాలు, లెక్చరర్ హాళ్లు, ల్యాబ్‌లు, హాస్టళ్లు, పడకల సంఖ్య, వైద్య పరికారాలు, నీటి సరఫరా, శానిటేషన్ ఉన్నాయి. రెండో అంశంలో అధ్యాపకులు, సిబ్బంది పోస్టులు, ఖాళీలు, మూడో అంశంలో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన ప్రణాళిక అమలు, నాలుగో అంశంలో విద్యార్థుల సంక్షేమం, మోడికోలకు వసతి, సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, ర్యాగింగ్ నిరోధ చర్యలు, విద్యార్థుల ఫిర్యాదులున్నాయి. ఐదో అంశంలో ఆర్థికపరమైన అంశాలు, అవసరమైన నిధులు, ఆరో అంశంలో డిజిటల్ వ్యవస్థలో భాగంగా హాజరు అమలు, సీసీ టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటివి ఉన్నాయి. ఆయా అంశాలపై కమిటీ తనిఖీలు చేసి నివేదికలను ప్రభుత్వానికి అందించనుంది.
ఉమ్మడి జిల్లాలోని కాలేజీల
బాధ్యతలు డీపీహెచ్‌కు..
కమిటీలో కలెక్టర్లకు చోటు