
ఇసుక మేమే సరఫరా చేస్తాం
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులపై ఇసుక భారం పడొద్దని మంచి లక్ష్యంతో ప్రభుత్వం స్థానికంగా ఉన్న మండలాల్లో ఇసుక క్వారీల నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రాక్టర్ల యజమానుల ఇష్టారాజ్యంతో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందక భారంగా మారింది. బిచ్కుంద మండలం పుల్కల్, హజ్గుల్, శెట్లూర్, ఖద్‌గాంలో ఇసుక క్వారీలు ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు ఈ క్వారీల నుంచి తీసుకెళ్లవచ్చని జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తరలించాలని సూచించారు. పుల్కల్, హజ్గుల్, ఖద్‌గాం గ్రామాల ట్రాక్టర్ యజమానులు కొర్రీలు పెట్టి మా గ్రామం ఇసుకను మా గ్రామ ట్రాక్టర్ల ద్వారానే ఇసుక విక్రయిస్తాం.. వేరే గ్రామాల ట్రాక్టర్లను క్వారీలోకి రానివ్వమని అడ్డుకుంటున్నారు. మా గ్రామం ఇసుక మేమే అమ్ముతామంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం మండలాల ట్రాక్టర్లకు అధికారులు ఇసుక అనుమతి ఇస్తే తక్కువ కిరాయితో లబ్ధిదారులకు ఇసుక వేస్తామని ట్రాక్టర్లు యజమానులు అంటున్నారు. అధికారులు ఇతర మండలాలకు అనుమతులు ఇవ్వకుండా ఆ నాలుగు గ్రామాల ట్రాక్టర్లకు మాత్రమే ఇసుక అనుమతి ఇవ్వడంతో అధికారులకు ముడుపులు అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ధరలు పెంచేశారు..
హజ్గుల్, పుల్కల్, ఖద్‌గాం ఒక్కో గ్రామంలో 65 నుంచి 85 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆరు నెలల క్రితం బిచ్కుందలో రూ.1,800 ట్రాక్టర్ ఇసుక ధర ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.700 నుంచి వెయ్యి పెంచేశారు. జుక్కల్ మండంలో రూ.2,700 ధర ఉండగా రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. పిట్లంలో రూ.3,200 నుంచి రూ. 4,500 ఇసుక ట్రాక్టర్ విక్రయిస్తున్నారు. ఇతర మండలాల ట్రాక్టర్లు ఈ ధర కంటే తక్కువలో ఇసుక విక్రయిస్తామని చెబుతున్నారు. ఇందిరమ్మ గృహాలకు అధికారులు సీనరేజ్ చార్జీలు లేకుండానే ఉచితంగా వేబిల్లులు ఇస్తున్నారు. ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలు, ఇందిర్మ ఇళ్లకు అదే ధరతో ఇసుక విక్రయిస్తున్నారు. ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలకు ట్రాక్టర్‌కు రూ.900 సీనరేజ్ చార్టీలు కట్టాల్సి ఉంటుంది. ఇందిరమ్మ పేరుతో ప్రైవేటుకు, జుక్కల్ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, నారాయణ్‌ఖేడ్, కంగ్టి ప్రాంతాలకు అక్రమ ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పుల్కల్, హజ్గుల్, ఖద్‌గాం మంజీరా నుంచి ప్రతి రోజు మూడు నుంచి నాలుగు వందల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. శనివారం సుమారు 300 ట్రాక్టర్లకు రెవెన్యూ అధికారులు వేబిల్లులు ఇచ్చినట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక భారం..
ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 10 నుంచి 13 ట్రాక్టర్ల ఇసుక అవసరముందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జుక్కల్ నియోజక వర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 2,300 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉందని బిచ్కుంద తహసీల్ కార్యాలయానికి నివేదిక అందించారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక ఇందిరమ్మ పేరుతో తరలిపోతుంది కానీ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక మాత్రం అందని దాక్షలా మారింది. బిచ్కుంద మండలం చిన్నదడ్గిలో సుమారు 10 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటామని ముందుకు వచ్చారు. పిల్లర్ల గుంతలు తవ్వి 20 రోజులు అవుతున్నా ఇసుక మాత్రం అందడం లేదు. ప్రతి రోజు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇసుక ఇవ్వడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు ట్రాక్టర్లు అమ్ముకుంటున్నారని లబ్ధిదారులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఇతర మండలాల ట్రాక్టర్లకు ఇసుక కోసం అనుమతి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
వేరే మండలాల ట్రాక్టర్లు
ఇసుక కోసం రావొద్దు
అడ్డుకుంటున్న పుల్కల్, హజ్గుల్,
శెట్లూర్, ఖద్‌గాం ట్రాక్టర్ యజమానులు

ఇసుక మేమే సరఫరా చేస్తాం