
అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి
నిందితుల రిమాండ్
ఇందల్వాయి: అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళ అటవీ భూములను చదును చేస్తున్న గిరిజనులను ఆపబోతే ఎదురు తిరిగి అటవీశాఖ అధికారుల మీద దాడి చేసిన ఘటన ధర్పల్లి మండలం కొటాల్‌పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎఫ్‌ఆర్‌వో రవి మోహన్ భట్, ధర్పల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్ కొటాల్‌పల్లి బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్–593లో కొందరు గిరిజనులు చెట్లను నరికి అటవీ భూమిని చదును చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్షన్ అధికారి భాస్కర్, బీట్ ఆఫీసర్లు ఉదయ్, ప్రవీణ్, ఖదీర్ సిబ్బందితో వెళ్లి భూమిని చదును చేస్తున్న గిరిజనులను అడ్డుకొని ట్రాక్టర్‌ను రేంజ్ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బూక్య నవీన్, బాదావత్ పూల్‌సింగ్, బూక్య మధు, బూక్య సంగ్య తదితరులు అధికారులపై పొడికారం చల్లి దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం అధికారుల నుంచి ట్రాక్టర్‌ని లాక్కొని వెళ్లా రు. ఘటనపై శనివారం ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ, సిబ్బందితో కలిసి కొటాల్‌పల్లికి వెళ్లి నిందితులను పట్టుకొని రిమాండ్‌కి తరలించారు. ట్రాక్టర్‌ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దాడిలో పాల్గొన్న మిగితా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వివరించారు.