ప్రైవేట్ వద్దు.. సర్కారే ముద్దు
మాచారెడ్డి: ప్రైవేట్ వద్దు.. సర్కార్ బడి ముద్దు అంటూ పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చేరడానికి విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ పాఠశాలలో ఐదు రోజుల్లోనే వంద మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో వంద అడ్మిషన్లు అయిన సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మాట్లాడుతూ కొత్తగా అడ్మిషన్ తీసుకున్న వారితో కలిపి మొత్తం విద్యార్థుల సంఖ్య 591కి చేరిందన్నారు. ప్రస్తుతం పదో తరగతిలో 130 మంది విద్యార్థులున్నారన్నారు. 6 నుంచి 9 వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నామని, మరో వంద మంది వరకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తున్నందునే తమ బడిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల్‌రాజు, మల్లేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ హైస్కూల్‌కు అడ్మిషన్ల వెల్లువ
ఐదు రోజుల్లో వంద మంది
విద్యార్థుల చేరిక


