22న విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
● విజయవంతంగా నిర్వహిస్తాం :
కలెక్టర్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణలో భాగంగా అన్ని జిల్లా లలో ఈనెల 22 న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాక్ డ్రిల్ ఏర్పాట్లపై సమీక్షించారు. పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 22 న విపత్తు నిర్వహణపై మాక్‌డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. విపత్తుల సమయంలో రక్షణ పొందేలా ప్రజలకు ఇప్పటికే గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వర్షాకాలంలో జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించాయని, ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, విపత్తుల అంచనా, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో భారీ నష్టాలు కలుగకుండా చూడగలిగామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టాలు కలుగకుండా సిద్ధంగా ఉన్నామన్నారు. మాక్‌డ్రిల్‌ను కామారెడ్డిలోని జీఆర్ కాలనీ, కామారెడ్డి పెద్ద చెరువు వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, అగ్నిమాపక, పశుసంవర్ధక, సాగునీటి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
కామారెడ్డి అర్బన్ : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వివిధ శాఖల ఉద్యోగుల కృషి వల్ల ఎన్నికలు విజయవంతం అయ్యాయన్నారు.


