భవిత కేంద్రాల్లో సమస్యల తిష్ట
బాన్సువాడ రూరల్ : విద్యాహక్కు చట్టం 2009 అమలులో భాగంగా 6నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలందరూ ఉచిత నిర్బంధ విద్య పొందాలి. ప్రత్యేక అవసరాలు కల్గిన దివ్యాంగ విద్యార్థులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అప్పటి ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం 2012–13లో భవిత కేంద్రాలను నెలకొల్పింది. కామారెడ్డి జిల్లాలో 22మండలాల్లో భవితకేంద్రాలు కొనసాగుతుండగా ఐదింటికి మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. మిగిలిన 17 కేంద్రాలు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.
సుమారు 2వేల మంది దివ్యాంగులు..
కామారెడ్డి జిల్లాలోని 22 భవిత కేంద్రాల్లో సుమారు 2వేల మంది దివ్యాంగులు నమోదై ఉన్నారు. ఫిజియో థెరపీ, ప్రత్యేక విద్య కోసం వచ్చే విద్యార్థులు సుమారు 300 మంది ఉన్నారు. వీరంతా జన్యులోపాలతో పాటు పోలియో, పక్షవాతం, వినికిడిలోపం, ఎముకల బలహీనత, బుద్ధిమాంద్యం, బహుళవైకల్యం వంటి 21రకాల రుగ్మతలతో బాధపడ్తున్నారు. వీరితో ఎస్కార్టు సహాయంతో వివిధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు 400మంది వరకు ఉన్నారు.
మౌలిక వసతులు కరువు..
భవిత కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. మల,మూత్ర శాలలు పాడై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ర్యాంపులు, రెయిలింగ్ చెడిపోయాయి. గోడలపై బొమ్మలు లేక, ఏళ్ల తరబడి వాల్ పెయింటింగ్ చేయించక పోవడంతో భవనాలు బోసిబోతున్నాయి. బాన్సువాడలోని భవితకేంద్రంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కట్టిన ఏడాదికే మలమూత్ర శాలలు ఽపాడైపోయాయి. నీటిసౌకర్యం నిలిచిపోయింది. పలుచోట్ల టైల్స్ పగిలిపోయాయి. దీంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోనే భవితకేంద్రం ఉన్నా అధికారులు పట్టింపులేదు. భవిత కేంద్రానికి ఫిజియోథెరపీ, ప్రత్యేక విద్య కోసం వచ్చే విద్యార్థులు, వారి వెంట వచ్చే ఎస్కార్ట్‌లకు మూత్రవిసర్జనకు పోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని మూత్రశాలలు
సమస్యలు పరిష్కరించాలంటున్న ప్రజలు
నెలాఖరుకల్లా మరమ్మతులు
బాన్సువాడ భవిత కేంద్రంలో మల మూత్రశాలలు పాడైపోయిన మాట వాస్తవమే. భవిత కేంద్రానికి వచ్చే దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగకుండా ఈనెలాఖరు కల్లా నిధులు సమీకరించి మరమ్మతులు చేయిస్తాం.
– నాగేశ్వరరావు, మండల విద్యాధికారి, బాన్సువాడ
భవిత కేంద్రాల్లో సమస్యల తిష్ట
భవిత కేంద్రాల్లో సమస్యల తిష్ట


