
సమస్యల ఒడిలో సర్కారు బడి
కామారెడ్డి టౌన్ : వేసవి సెలవులు ముగింపునకు వచ్చాయి. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. బడులను తిరిగి తెరిచేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే తక్కువ ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు కసరత్తు నడుస్తోంది. అయితే షరామామూలుగా ఈసారీ విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి. చాలాచోట్ల మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
పెండింగ్‌లో రూ. 9.96 కోట్ల బిల్లులు..
పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టింది. జిల్లాలో మొత్తం 1,040 ప్రభుత్వ పాఠశాలలుండగా 973 పాఠశాలల్లో గతేడాది మార్చిలో వివిధ పనులు ప్రారంభించారు. విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలలకు అవసరమైన మరమతులు, తరగతి గదుల్లో మైనర్, మేజర్ మరమ్మతులు, తదితర పనుల బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. ఎంపిక చేసిన స్కూళ్లకు రూ. 22 కోట్ల పనులకు పరిపాలన పరమైన అనుమతులు లభించాయి. చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 98 శాతం పూర్తయ్యాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ పనులు చేసినవారికి ఇంకా రూ. 9.96 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అమ్మ అదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి బిల్లులు రాగానే చెల్లిస్తాం. బడుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి
చాలాచోట్ల మౌలిక వసతులు కరువు
ప్రహరీలు లేక ఇబ్బందులు
టాయిలెట్లు లేక అవస్థలు
రేపటి నుంచి పాఠశాలలు
పునఃప్రారంభం
ఎక్కడి సమస్యలక్కడే..
జిల్లాలో చాలా స్కూళ్లలో సమస్యలు తిష్టవేశాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు స్కూళ్ల ఆవరణలు కుంటలుగా మారుతున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాగునీటి సమస్యలున్నాయి. పలు స్కూళ్లకు ప్రహరీలు లేవు. వేసవి సెలవుల్లో బడులకు భద్రత కరువవడంతో కొన్నిచోట్ల ఆకతాయిలు నల్లాలను ధ్వంసం చేశారు. సరైన వంటశాలలు కూడా లేవు. వేసవి సెలవుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం పిల్లల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.

సమస్యల ఒడిలో సర్కారు బడి

సమస్యల ఒడిలో సర్కారు బడి