
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
మాచారెడ్డి/బిచ్కుంద : జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం గాలివాన బీభత్సాన్ని సృష్టించాయి. మాచారెడ్డి మండల కేంద్రంతో పాటు లక్ష్మీరావులపల్లి, చుక్కాపూర్, వాడి, పాల్వంచ, బిచ్కుంద తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద వడ్లు తడిసిపోయాయి. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వర్షంలో నానకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పినా గాలి వేగానికి అవి కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలురాలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రోడ్డు వెంట చెట్లు విరిగిపడడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు.