
బిచ్కుంద పీఎస్‌లో ఏసీబీ తనిఖీలు
బిచ్కుంద: ఏసీబీ అధికారులు బుధవారం బిచ్కుంద పొలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఎస్సై మోహన్‌రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. సుమారు ఆరు గంటలపాటు స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పొలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయన్నారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో తాము సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఎస్సై మోహన్‌రెడ్డి పట్టుకున్న పది ఇసుక ట్రాక్టర్లు పొలీస్ స్టేషన్‌లో ఉన్నాయని, వారిని డబ్బులు అడిగారని, అలాగే గతంలో పలు కేసులలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. దాని ఆధారంగా పూర్తి విచారణ చేసి పైఅధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. కాగా మంజీర నది పరీవాహక ప్రాంతాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదు చేసినవారెవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఏ శాఖ అధికారులౖపైనెనా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జరిమానా కట్టినా వదలడం లేదు
జరిమానా కట్టినా పొలీసులు ట్రాక్టర్లు వదిలిపెట్టడం లేదని పలువురు ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతితో ఇసుక తరలిస్తున్నామని, పట్టుకున్న పది ట్రాక్టర్లను ఎస్సై మోహన్‌రెడ్డి మైన్స్ అధికారులకు అప్పగించారని పేర్కొన్నారు. మైన్స్ అధికారులు విధించిన జరిమానా చెల్లించి నాలుగు రోజులవుతున్నా పొలీసులు ట్రాక్టర్లు వదిలిపెట్టడం లేదన్నారు.
అక్రమ వసూళ్ల విషయంలో
ఎస్సైపై విచారణ
ఆరు గంటలపాటు కొనసాగిన సోదాలు