
బ్రిడ్జీలను నిర్మించారు.. రోడ్డును మరిచారు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి, కాలోజీవాడి శివార్లలోని రహదారుల మధ్యలో రెండు బ్రిడ్జీలను నిర్మించారు. బ్రిడ్జిలకిరువైపులా తారు రోడ్డు వేయకుండా అలాగే వదిలేశారు. ఈరోడ్డు గుండా నిత్యం వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొరం వేయడంతో కొద్దిపాటి వర్షానికే తొలగిపోయి గుంతలయంగా మారుతున్నాయి. దీంతో ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి కిందపడుతున్నారు. వర్షాకాలంలో కాలోజీవాడి, బ్రాహ్మణపల్లి శివారులో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండేవి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఐదుగ్రామాల ప్రజలు జిల్లా కేంద్రం, మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. 2023లో ప్రభుత్వం బ్రాహ్మణపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు, కాలోజీవాడి నిర్మాణానికి రూ. 2.10 కోట్ల నిధులను మంజూరు చేసింది.వెంటనే అధికారులు పనులను ప్రారంభించారు. గతేడాది రెండు బ్రిడ్జ్‌ల నిర్మాణాలను పూర్తిచేశారు. సదరు కాంట్రాక్టు బ్రిడ్జిలపై తారు రోడ్డు వేయడం కుండా మట్టిమొరం పోసి వదిలేశారు. పక్కనే ఉన్న భిక్కనూరు మండలంలో ఆరునెలల క్రితం ప్రారంభమైన బ్రిడ్జిలను పూర్తి చేసి బీటీవేశారు. ఇక్కడ మాత్రం మధ్యలోనే ఆపేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జిల వద్ద తారు రోడ్డును వేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి, కాలోజీవాడి శివార్లలో నిర్మాణం
తారు రోడ్డు వేయక ఇబ్బందులు
ఎదుర్కొంటున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు,
ప్రజాప్రతినిధులు
కాంట్రాక్టర్‌కు బిల్లులు రాలేదు
రెండు బ్రిడ్జిలను నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. సదరు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం బిల్లులు విడుదల చేసిన వెంటనే బ్రిడ్జిల వద్ద ఉన్న తారు రోడ్డు వేసేలా చూస్తాం.
– రవితేజ, ఆర్‌అండ్‌బీ ఏఈ, తాడ్వాయి

బ్రిడ్జీలను నిర్మించారు.. రోడ్డును మరిచారు