
మెరుగైన బోధనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ
బాన్సువాడ రూరల్: విద్యాబోధనలో నైపుణ్యాలను పెంచేలా జిల్లాలోని గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి 24వ తేదీవరకు టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన జిల్లా రిసోర్స్ పర్సన్స్ వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ సబ్జెక్టుల బోధనను మెరుగు పర్చుకునేలా జీవన నైపుణ్యాలు లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంపుదలకు ఈశిక్షణ తోడ్పడనుంది.
కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు లేదా ఎంఈవోలు సూచించిన పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఐదు రోజుజుల పాటు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఉంటుంది. మధ్యాహ్న భోజన వసతి, టీ, స్నాక్స్ కూడా అందజేయనున్నారు. విధిగా ఉపాధ్యాయులంతా శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది.
25 మండలాల్లో శిక్షణ..
జిల్లాలోని 25మండలాల్లో మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో మండల స్థాయిలో ఎస్టీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలకు రెండోవిడత శిక్షణ ఈనెల 20 నుంచి 24 వరకు ఇవ్వనున్నారు. సుమారు 2500మంది టీచర్లు శిక్షణలో పాల్గొననున్నారు. మరో సుమారు 2వేల మంది గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు కామారెడ్డి జిల్లాకేంద్రంలో 10సెంటర్లలో అలాగే బాన్సువాడలో 4చోట్ల శిక్షణ కొనసాగనుంది. 27 నుంచి తుది విడత శిక్షణ నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు నిజామాబాద్‌లోని డైట్ కాలేజీలో శిక్షణ కొనసాగిస్తున్నారు.
ప్రధానాంశాలు..
ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా ఎఫ్‌ఎల్‌ఎన్, ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), డిజిటల్ పాఠాలపై లర్నింగ్ అవుట్ కమ్స్, లైఫ్‌స్కిల్స్, తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. జిల్లాస్థాయిలో ఇటీవల శిక్షణ పొందిన మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు ఈ ఉపాధ్యాయులకు గుర్తించిన శిక్షణ ఇవ్వనున్నారు. మండల విద్యాశాఖాధికారులు గుర్తించిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులు టెక్ట్స్ బుక్స్ వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ కొరకు ఐఫోన్ బదులుగా అండ్రాయిడ్ ఫోన్ వెంట తీసుకుని వస్తే అందులో రోజువారి అస్సెస్మెంట్ మరియు ఎవల్యూయేషన్ ఉంటుంది.
ఎస్జీటీలకు నేటి నుంచి
24వ తేదీ వరకు..
ఎస్‌ఏలకు 3 దశల్లో ట్రైనింగ్
4,500 మందికి శిక్షణ
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు విడతల్లో సుమారు 4500 మంది ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టులపై వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. ఎంఈవోల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలి. హాజరు కాని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి

మెరుగైన బోధనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ