
తండ్రి దాడిలో కొడుకు మృతి
కామారెడ్డి క్రైం: తండ్రీకొడుకుల మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ (24) కొన్ని నెలల క్రితం గల్ఫ్ వెళ్లి మూడు నెలల క్రితం తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి నిఖిల్ మద్యం, కల్లు లాంటి దురలవాట్లకు బానిసయ్యాడు. డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఆదివారం రాత్రి తండ్రి భాస్కర్‌తో గొడవ జరిగింది. భాస్కర్ ఆవేశంతో అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్డుతో నిఖిల్‌పై దాడి చేశాడు. నిఖిల్ తలకు బలమైన గాయం కావడంతో వెంటనే కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిఖిల్ సోమవారం మృతి చెందాడు. భాస్కర్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.