
డ్రంకన్‌డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
రుద్రూర్: మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు డ్రంకన్‌డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. బొప్పపూర్ గ్రామానికి చెందిన సాయిలు, రానంపల్లి గ్రామానికి చెందిన వీరేశంలు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా జడ్జి ఒకరికి మూడురోజుల జైలు, మరొకరికి రెండు రోజుల జైలుశిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
సిలిండర్ లీకై మంటలు
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని రాజనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గందం గంగామణి ఇంట్లో శుక్రవారం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇంట్లో మంటలు వ్యాపించడంతో విలువైన సామగ్రి, నిత్యవసర సరుకులు కాలిపోయాయి.
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
రాజంపేట: మండలంలోని షేర్ శంకర్ తండాలో విద్యుత్ షాక్‌తో ఓ ఆవు మృతి చెందింది. తండాలోని రైతు కాట్రోత్ సురేందర్‌కు చెందిన ఆవు శుక్రవారం ఉదయం గ్రామ శివారులో మేతకు వెళ్లగా సమీపంలోని విద్యుత్ వైర్ల కర్ర విరిగిపడగా, కర్రకు కట్టిన విద్యుత్ తీగలు ఆవుపై పడటంతో షాక్‌తో మృతిచెందింది. సుమారు రూ. 50వేల వరకు నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
కామారెడ్డి క్రైం/సదాశివనగర్(ఎల్లారెడ్డి): పాత గొడవలను మనసులో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కామారెడ్డి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలా.. సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద 2020 జూలై 13న ఓ మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు విచారణ జరిపి మృతుడిని సదాశివనగర్‌కు చెందిన మాడల సతీష్‌గా గుర్తించారు. అతనికి, అదే గ్రామానికి చెందిన గోల్కొండ రవి కుమార్‌కు మధ్య గొడవలు ఉండేవి. సతీష్ తరచుగా రవి కుమార్‌ను, అతని కుటంబ సభ్యులను తిడుతుండేవాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని రవి నిర్ణయించుకున్నాడు. అదే సంవత్సరం జులై 10న రవి ఆర్మూర్ దాకా వెళ్లి వద్దామని అతడిని నమ్మించాడు. సదాశివనగర్ మండల కేంద్రం శివారులోని కామారెడ్డి వైపునకు వెళ్తున్న మార్గమధ్యలో రహదారిపై ఉన్న కల్వర్డు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ తర్వాత వంతెన పైనుంచి కిందికి తోసి వేశాడు. దీంతో సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రవీందర్ కల్వర్టు కిందికి వెళ్లి గాయాలతో కొట్టుకుంటున్న సతీష్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వీఆర్‌ఆర్ వరప్రసాద్ నిందితుడికి జీవిత ఖైదుతోపాటు, రూ.2వేల జరిమానా విధిస్తు తీర్పు ఇచ్చారు. అప్పటి సదాశివనగర్ సీఐం వెంకట్, ఎస్సై జగడం నరేశ్, ప్రస్తుత సీఐ సంతో ష్‌కుమార్, ఎస్సై రంజీత్‌లను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.

డ్రంకన్‌డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు