కామారెడ్డి క్రైం: దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష, భారతీయ దివ్యాంగుల పరికరాల పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో కామారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించాలన్నారు. 2014 లో ఓ దివ్యాంగుడు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీఈవో రాజు, ఆర్డీవో వీణ, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు నాగవేందర్, కృష్ణ చైతన్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.