అమలాపురం టౌన్: ముందు రెక్కీ నిర్వహిస్తారు.. తాళం వేసిన ఇళ్లను గమనిస్తారు.. రాత్రి పూట ఆ ఇళ్లకు వెళ్లి తాళాలు బద్దలుకొట్టి చోరీలకు పాల్పడతారు. ఇలా ఆలమూరు మండలం పేనికేరు గ్రామంలో గత నెల 14న రాత్రి ఓ ఇంట్లో జరిగిన చోరీపై తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ దొంగల ముఠా బండారం బయట పడింది. చోరీలు చేస్తున్న ఆ ముగ్గురూ 22 ఏళ్ల లోపు యువకులే. ఇందులో ఆలమూరు మండలం పెద్ద పళ్ల గ్రామానికి చెందిన కంచెర్ల జార్జ్ బెన్నీ, సన్నపు శ్రీచరణ్, కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఉందుర్తి ఆనంద్‌కుమార్‌లను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 32.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐలు, ఎస్సైలతో కలసి అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో తాజాగా జరిగిన రెండు చోరీ కేసుల్లో పైముగ్గురు నిందితులు. కంచెర్ల జార్జిబెన్నీపై గతంలో ఆలమూరు, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం, గంజాయి కేసులు ఉన్నాయి. ఉందుర్తి ఆనంద్‌కుమార్‌పై గతంలో ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు ఉంది. ఈ చోరీ కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్‌తో పాటు రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం సీసీఎస్ సీఐ ఎం.గజేంద్రకుమార్, క్లూస్ టీమ్ సీఐ కె.ప్రవీణ్‌కుమార్, ఆలమూరు ఎస్సై జి.నరేష్, సీసీఎస్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, సీసీఐ ఏఎస్సై రాజు తదితరులను ఎస్పీ ప్రశంసించారు. అనంతరం వారికి నగదు రివార్డులను అందించారు. ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊళ్లకు వెళితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మీనా విజ్ఞప్తి చేశారు.
ఫ చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్
ఫ రూ.32.40 లక్షల సొత్తు స్వాధీనం


