పాలాకులు పట్టించుకోక.. | - | Sakshi
Sakshi News home page

పాలాకులు పట్టించుకోక..

Mar 10 2026 7:19 AM | Updated on Mar 10 2026 7:19 AM

అధికారుల పర్యవేక్షణ కరవు

లొల్ల లాకులను 20 ఏళ్ల నుంచి పట్టించుకోవడం లేదు. ప్రధానంగా బ్యాంకు కాలువపై ఉన్న లాకులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటుగా అధిక బరువు ఉన్న లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇరిగేషన్‌ శాఖ పర్యవేక్షణ కరవైంది. ఈ సమస్యను కొత్తపేట ఎమ్మెల్యే బండారు అనేక సార్లు సీఎం దృష్టిలో పెట్టారు.

– కరుటూరి నరసింహారావు,

అంకంపాలెం, జిల్లా ప్రాజెక్ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌

వెంటనే నిర్మించాలి

కూటమి ప్రభుత్వం వెంటనే లొల్ల లాకులను నిర్మించాలి. లొల్ల లాకులపై అమలాపురం– బొబ్బర్లంక ఆర్‌అండ్‌బీ రహదారి ఉండటం వల్ల భారీ వాహనాలతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ లాకులను పునర్నిర్మించడం వల్ల కోనసీమ ప్రాంత రైతులకు సాగునీరు సజావుగా అందుతుంది.

– ముదునూరి రామకృష్ణంరాజు,

వైఎస్సార్‌ సీపీ రైతు నాయకుడు

ఆత్రేయపురం: కాటన్‌ మహాశయుని ఆశల సౌథం ధవళేశ్వరం బ్యారేజీ. ఇక్కడి నుంచే మూడు డెల్టా కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు చేరుతోంది. ఇందులో మధ్య డెల్టా కాలువ ప్రధానమైంది. బొబ్బర్లంక వద్ద కాటన్‌ బ్యారేజీ నుంచి వచ్చే నీరు ఈ డెల్టా కాలువ ద్వారా ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకుల మీదుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పంట పొలాలకు చేరుతోంది. ఇంతటి ప్రధానమైన లొల్ల లాకులు శిథిలస్థితికి చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మధ్య డెల్టా ప్రధాన కాలువ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, ఆయా గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు అందుతోంది. లొల్ల లాకులు శిథిలస్థితికి చేరడంతో నీటి పారుదలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.

లొల్ల లాకుల వద్ద మధ్య డెల్టా ప్రధాన కాలువ మూడు కెనాల్స్‌గా కోనసీమ జిల్లా అంతటికి ప్రధానంగా రాజోలు దీవికి సైతం సాగు, తాగునీరు అందిస్తోంది. లొల్ల లాకుల వద్ద అమలాపురం, గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్స్‌గా విడిపోతాయి. ఈ లాకుల వద్ద ఎటువంటి ప్రమాదం జరిగినా భవిష్యత్తు ఊహించరానిది.

రాకపోకలకూ ఆధారమే..

బొబ్బర్లంక ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్రయాణించే అన్ని వాహనాలు లొల్ల లాకుల పైనుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సరైన రక్షణ చర్యలు లేక లాకుల పైనుంచి కాలువలోకి వాహనాలు దూసుకుపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇరుకుగా ఉండడంతో లారీలు వంటి భారీ వాహనాలు మలుపు తిరిగే సమయంలో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ రోడ్డు కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి వచ్చే పోయే వాహనాల రద్దీతో నిత్యం రద్దీగా ఉంటోంది. శనివారం అయితే ఇక చెప్పనవసరం లేదు. పైగా ఆత్రేయపురం మండలంలో ఇసుక ర్యాంపులు ఉండడంతో భారీ వాహనాలపై నిరంతరం ఇసుక తరలింపు జరుగుతోంది. ఈ లాకుల మీదుగానే వాహనాలు వెళ్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

అప్పట్లో సంకల్పించి.. ఇప్పుడు వదిలేసి..

లొల్ల లాకులు శిథిలం కావడంతో రాజోలు దీవికి సాగునీరు సక్రమంగా అందడం లేదు. కాగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ విప్‌గా చిర్ల జగ్గిరెడ్డి లొల్ల లాకుల రక్షణకు, ప్రత్యేకంగా అమలాపురం– బొబ్బర్లంక రోడ్డు ప్రయాణానికి అనువుగా ఒక వంతెన నిర్మించాలని భావించారు. అందుకు ప్రతిపాదనలు సైతం పంపి ఆమోదం చేయించారు. కానీ నిర్మాణ పనులు చేపట్టే లోపు ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కనీసం ఈ సమస్యను పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా లొల్ల లాకులను పునర్నిర్మించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

లొల్ల లాకులపై ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డు

శిథిలస్థితిలో ఉన్న లొల్ల లాకులు

అనుమతులు రాగానే పనులు

కాటన్‌ మహాశయుని నిర్మాణ ప్రతిభకు లొల్ల లాకులు అద్దం పడతాయి. 1883లో నిర్మించిన ఈ లాకుల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ లాకులను పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధానంగా మూడు లాకుల్లో ఒకటైన లొల్ల లాకులు, ముక్తేశ్వరం బ్యాంకు కాలువపై ఉన్న లాకులు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతాం.

– ఈవు సూర్యచంద్ర వరప్రసాదరావు,

ఏఈ, గోపాలపురం హెడ్‌వర్క్స్‌

జల వనరులకు నడక నేర్పిన కట్టడం అది.. పచ్చని సిరులు పండించేందుకు కీలక భూమిక అది.. ఇక్కడి అందాలు ఎన్నో చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.. అలాంటి కట్టడం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది.. కూటమి పాలకుల

నిర్లక్ష్యానికి చిక్కి శల్యమవుతోంది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల పరిస్థితి ఇది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అపురూప కట్టడం పరిస్థితిని చూసొద్దాం రండి..

ఫ శిథిలస్థితిలో లొల్ల లాకులు

ఫ కూటమి ప్రభుత్వంలో

కానరాని అభివృద్ధి

ఫ ప్రమాదం జరిగితే బాధ్యులెవరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement