కల్తీ కుళ్లు కూటమి నేతల్లోనే..
జగ్గంపేట: తిరుపతి లడ్డూలో కల్తీ లేదని విచారణ సంస్థలు చెప్పడాన్ని కూటమి నేతల తట్టుకోలేక పోతున్నారని, కల్తీ కుళ్లు అంతా కూటమి నేతలలోనే వుంది తప్ప లడ్డూలో కాదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తోట నరసింహం విమర్శించారు. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్న శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు మనోభావాలు దెబ్బ తినేలా లడ్డూ రాజకీయాన్ని కూటమి నేతలు కొనసాగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పట్ల, కూటమి నేతలకు కనీసం గౌరవం లేదని, తమ తప్పలను కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు అండ్ కో ఎంతకై నా దిగజారుతారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రమాదాలు జరగడం, భక్తులు మరణించడం లాంటి ఘటనలు అనేకం జరగడం హిందువులు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసే తప్పులకు భక్తులు బలికావడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. గతంలో రాజమహేంద్రవరం పుష్కరాల సమయంలోను, ఇప్పడు సింహాచలం, తిరుపతిలోనూ జరిగిన ఘటనలలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు. శ్రీశైలంకు శివ మాల ధరించి వచ్చిన శివస్వాములకు సౌకర్యాలు కల్పించలేక వారిపై లాఠీచార్జి చేసిన దుర్మార్గపు ప్రభుత్వం చంద్రబాబుదని విమర్శించారు. తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో వైఎస్సార్ సీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలకు ముఖ్యంగా హిందువులకు దూరం చేయాలని చంద్రబాబు చేసిన కుట్ర రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులకు అర్థమయిందని అన్నారు. చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యంలేక ఇంకా కల్తీ కుళ్లు రాజకీయాలు చంద్రబాబు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులుగా వైఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు రాష్ట్రంలోను, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్మించడానికి కృషి జరిగిందని చెప్పారు. శ్రీవాణి దర్శనం ఏర్పాటు చేసి ఆ సొమ్ముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
తిరుపతి వెంకన్న చంద్రబాబును క్షమించడు
కేవలం వైఎస్సార్ సీపీని అణచివేయాలనే ఉద్దేశంతో తిరుపతి వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటే ఆయన చంద్రబాబును క్షమించడని అన్నారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగివుంటే బీజేపీ ఎప్పుడో విమర్శలు చేసేదని, లడ్డూ కల్తీపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాని, హిందూ సంస్థలు కాని ఎక్కడా మాట్లాడడం లేదని, తప్పు ఎవరితో వారికి తెలుసని అన్నారు. కూటమి నేతలు చేస్తున్న తప్పడు ఆరోపణలను ప్రశ్నించినందుకు వైఎస్సార్ సీపీ సీనియిర్ నేత అంబటి రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని అన్నారు. పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షుడు రావుల గణేష్‌రాజా, గోకవరం మండల అధ్యక్షుడు పాటి రాంబాబు, నేతలు రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, కరుటూరి వీర్రాజు పాల్గొన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు
పుణ్యక్షేత్రాలలో అపచారాలు,
భక్తుల మరణాలు
శ్రీశైలంలో శివస్వాములపై
లాఠీచార్జి అన్యాయం
మాజీ మంత్రి, తోట నరసింహం


