‘ఆర్చి’ నిర్మాణం ప్రారంభం
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మొదటి ఘాట్‌రోడ్ వద్ద నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. దీంతో బాటు మెట్లకు ఇరువైపులా భక్తుల భద్రతకు పిట్టగోడ పనులు కూడా ప్రారంభించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేయనున్నారు. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పున ఆర్చి నిర్మించనున్నారు. దేవస్థానం కళాశాల మైదానం ఎదురుగా గల ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్లదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయని, ఆర్చి, పిట్టగోడ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాక ఈ మెట్లదారిని ప్రారంభిస్తామని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
పొట్టి శ్రీరాములు ట్రస్టుకు
రూ.10 లక్షల విరాళం
జగ్గంపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని పెద్దాపురానికి చెందిన లలితా ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ బుధవారం అందజేశారని ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొత్త కొండబాబు తెలిపారు. జగ్గంపేటలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేయనున్న 58 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం, ఆడిటోరియం కోసం విరాళంగా రూ.10 లక్షలను వారు అందజేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దొండి రాకేష్‌తో కలిసి వెళ్లి పెద్దాపురంలో మట్టే సోదరులను కలిసామని చెప్పారు. వారు చెక్‌ను అందజేసారని తెలిపారు. మట్టే సోదరులను శాలువాలతో సత్కరించినట్లు ఆయన చెప్పారు.
గుండెపోటుతో
వైద్యుడి మృతి
నిడదవోలు: పట్టణంలోని అమ్మ హాస్పిటల్ వైద్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో అందే వీవీఎస్ తాతారావు (56) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తణుకులో విధులు ముగించుకుని నిడదవోలు ఇంటికి కారులో వస్తుండగా ఉండ్రాజవరం రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కగా ఆపగా స్థానికులు గమనించి బయటకు తీసి అంబులెన్సులో తణుకు తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు చిట్టి ప్రణతి, ప్రవళ్లిక ఉన్నారు. తాతారావు తల్లి మొగల్తూరు వైఎస్సార్ సీపీ ఎంపీపీగా చేస్తున్నారు. తండ్రి భుజంగరావు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.
మహాలక్ష్మి ఆలయానికి
రూ.11.5 లక్షల విరాళాలు
పి.గన్నవరం: లంకల గన్నవరం గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం పలువురు గ్రామస్తులు రూ.11.5 లక్షల మేర విరాళాలు అందజేశారు. యర్రంశెట్టి అచ్యుత రామయ్య కుమారుడు రాజారావు రూ.3.01 లక్షలు, మొండెపులంక లాకు ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు రూ.2.25 లక్షలు, యర్రంశెట్టి రాజు (జొన్నలరాజు) రూ.2.06 లక్షలు, యర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రూ.1.6 లక్షలు, యర్రంశెట్టి చిన్న లోన వారి సేవా కమిటీ సభ్యులు రూ.1.01 లక్షలు, తాపీమేస్త్రి అంబటి దుర్గారావు రూ.50 వేలు, గన్నవరపు అప్పారావు కుటుంబ సభ్యులు రూ.21 వేలు, రామేశ్వరపు గోవిందరావు రూ.20 వేలు, యర్రంశెట్టి బులి వెంకయ్య కుటుంబ సభ్యులు రూ.20 వేలు, లంకే పాల్గుణ రూ.15 వేలు, ఇంకా పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.
‘ఆర్చి’ నిర్మాణం ప్రారంభం
‘ఆర్చి’ నిర్మాణం ప్రారంభం


