యాజమాన్యంతో మొక్కవోని దిగుబడి
● మారిన వాతావరణంతో తెగుళ్లు
● సస్య రక్షణతో నివారించవచ్చునని
సూచిస్తున్న వ్యవసాయ అధికారులు
పెరవలి: మొక్కజొన్న పంటపై తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, పోలవరం, నల్లజర్ల మండలాల్లో 1500 ఎకరాల్లో రబీ పంటగా దీనిని వేశారు. చల్లటి, వెచ్చని వాతావరణం ఉండడంతో ఈ పంటను తెగుళ్లు ఆశించాయి. ముఖ్యంగా కాండం తొలిచే చారల పురుగు, గులాబీరంగు పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకుమాడు తెగులు, మసికుళ్లు తెగులు ఆశించి ఉన్నాయి. వీటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి కొవ్వూరు ఏడీఏ సీహెచ్ శ్రీనివాస్‌రావు వివరించారు.
రసం పీల్చే పురుగులు
మొక్కజొన్న పంట వేశాక 30 రోజుల వయసు కలిగిన పంటపై నల్లి, పేనుబంక ఆశిస్తాయి. తల్లి, పిల్ల పురుగులు మొక్క ఎదిగే భాగాల నుంచి, ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు లేత పసుపు రంగుకు మారి గిడసబారిపోతాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురును విడుదల చేసి శిలీంధ్రాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి. దీనితో తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది.
నివారణ చర్యలు
రసం పీల్చే పురుగులు ఆశించినట్లు గమనించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ గ్రాము మందు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మసికుళ్లు తెగులు
ఈ తెగులు సోకిన మొక్కలు మొదట ఆకులు తరువాత కాండం మొదలు భాగం ఆకుపచ్చగా మారి తరువాత గోధుమరంగుకు మారి క్రమేపీ మొక్క ఎండిపోతుంది. కాండం లోపల బెరడు కుళ్లిపోయి నాళాలపై బొగ్గుపొడి లాంటి నల్లని శిలీంధ్ర బీజాలు (స్ల్కిరోషియా) ఏర్పడి కాండం బలహీనపడి ఎండిపోతుంది.
నివారణ చర్యలు
ఈ తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే కార్బండిజిమ్ గ్రాము లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చేలో కలుపును నివారించి మొక్కలకు గాలి తగిలేలా చూడాలి.
కాండం తొలిచే చారల పురుగు
10 నుంచి 20 రోజుల వయసు కలిగిన పైరును ఈ పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు మొక్కజొన్న అంకురంలోకి చేరి దానిని తినడంతో మొవ్వ చనిపోయి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఆకులకు రంధ్రాలు ఏర్పరచి తినేస్తాయి. ఈ పురుగులు ఆకులు, కాండాన్ని, పూతని, కంకిని ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
గులాబీరంగు పురుగు
ఈ పురుగు ఎక్కువగా రబీలో ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రాత్రి సమయాల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు పలచగా తయారవుతాయి. అక్కడ నుంచి కాండంలో గుండ్రని లేక ఎస్ ఆకారంలో ఉండే సొరంగాలను ఏర్పాటు చేసుకుని అంకురాన్ని చేరతాయి. అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. ఆకులు ఒంగిపోయి రాలిపోతాయి. పై రెండు పురుగులను నివారించడానికి ఇవి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
నివారణ చర్యలు
ఈ పురుగులు ఆశించినట్లు రైతులు గుర్తించిన వెంటనే ఎకరం చేనుకి క్లోరాంట్రానిలిప్రోల్ 60 మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండీఎమైండ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 3 కిలోలు మొక్కల మొవ్వలో వేయాలి.
యాజమాన్యంతో మొక్కవోని దిగుబడి
యాజమాన్యంతో మొక్కవోని దిగుబడి
యాజమాన్యంతో మొక్కవోని దిగుబడి


