నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్‌! | - | Sakshi
Sakshi News home page

నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్‌!

Feb 12 2026 7:36 AM | Updated on Feb 12 2026 7:36 AM

నాడి

నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్‌!

కాకినాడ క్రైం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. విజయవాడలోని బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (బీఈ జీఎన్‌ఎం బోర్డు) ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కనీస తరగతులు కూడా నిర్వహించకుండా విద్యార్థులకు పరీక్షలకు పంపే ప్రైవేటు నర్సింగ్‌ పాఠశాలల యాజమాన్యాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరంలో పరీక్షలు జరుగుతుండగా కాకినాడ, ఒంగోలు నుంచి రాజమహేంద్రవరానికి ఓఎస్‌డీగా వెళ్లిన ఇద్దరు నర్సింగ్‌ ట్యూటర్లు ఈ వసూళ్లు, కాపీయింగ్‌లలో కీలకంగా వ్యవహరిస్తూ సంబంధిత అధికారులను సైతం భాగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో...

కాకినాడ కేంద్రంగా జీజీహెచ్‌ అధికారుల నిర్వహణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జీఎన్‌ఎం పరీక్షలు జరిగేవి. కాగా, పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య 8,000కు చేరే సరికి నిర్వహణ క్లిష్టంగా మారింది. దీంతో రాజమహేంద్రవరం సమీపంలోని పాఠశాలల విద్యార్థులకు అక్కడ జీజీహెచ్‌లోనే పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశారు. అంతకు ముందు నర్సింగ్‌ పరీక్షలలో కీలకంగా వ్యవహరించిన ఓ గుమాస్తా 18 ఏళ్లుగా అదే స్థానంలో పనిచేశారంటే వసూళ్లు ఏ మేరకు సాగి ఉంటాయో అంచనా వేయొచ్చు. ఈ పరిస్థితిని గమనించిన అప్పటి సూపరింటెండెంట్‌ అతనిని వేరే విభాగానికి సాగనంపారు. పరీక్షలు నిర్వహించే ప్రతీసారీ ఇదే తంతు నడిచేది. తాజాగా కాకినాడలో కాపీయింగ్‌ నియంత్రించినా, రాజమహేంద్రవరంలో వసూళ్లు సైతం యథేచ్ఛగా సాగుతున్నట్టు అక్కడ పరీక్షలు రాసి వచ్చినవారే చెప్పడం గమనార్హం. దీనిపై ఏకంగా ఇంటిలిజెన్స్‌ విభాగం ఆరా తీస్తోందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

సబ్జెక్టుకు రూ.500 స్కూలుకి రూ.25 వేలు!

రాజమహేంద్రవరంలో ప్రాక్టికల్స్‌ కోసం ప్రతి విద్యార్థి నుంచి సబ్జెక్టుకు రూ.500 చొప్పున వసూలు చేయగా, ప్రతి నర్సింగ్‌ స్కూల్‌ నుంచి థియరీ పరీక్షల కోసం రూ.25 వేల చొప్పున మొత్తం సుమారు రూ.40 లక్షల పైచిలుకు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో పరీక్ష హాల్లో నోట్సులు, స్లిప్పులను అనుమతిస్తున్నారనే చర్చ సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా తలుపులు మూసి పరీక్షలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాకినాడలో 33 పాఠశాలల్లోని 4,142 మంది, రాజమహేంద్రవరంలో 20 స్కూళ్లకు చెందిన సుమారు 3,500 మంది ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 7 వేలపై చిలుకు ప్రాక్టికల్స్‌, థియరీ రెండు పరీక్షలకు హాజరవుతున్నారు.

ఇంటలిజెన్స్‌ విచారణ..

రాజమహేంద్రవరం నర్సింగ్‌ పరీక్షల్లో అవినీతి రట్టవడం ఇంటలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. వారు ఆస్పత్రిలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వసూళ్లు, కాపీయింగ్‌ వ్యవహారంపై విద్యార్థులు సహా క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. వారు పలు విధాలుగా విచారణ చేస్తున్నారు.

కాకినాడ, రాజమహేంద్రవరంలో

జీఎన్‌ఎం పరీక్షలు

తలుపులు వేసి కాపీ చేయిస్తున్నారనే

ఆరోపణలు

ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో

ఇంటలిజెన్స్‌ విచారణ

నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్‌!1
1/1

నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement