శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగలవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా పిఠాపురం, సామర్లకోట శైవ క్షేత్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకూ పిఠాపురం, సామర్లకోట శైవక్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, సామర్లకోటలోని చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశముందని, వారికి ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గత ఏడాది పిఠాపురం 70 వేల మంది భక్తులు వచ్చారని, ఈసారి అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా క్యూలు, తాగునీటి సరఫరా, ఆహారం, స్నాన ఘట్టాల్లో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మంచినీటి నాణ్యతను పరీక్షించి, సరఫరా చేస్తామని చెప్పారు. పాదగయ పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలకు ఏలేరు నుంచి కొత్త నీరు వచ్చేలా ఇప్పటికే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ రెండు క్షేత్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, 108 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను క్రమబద్ధీకరిస్తూ సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. లింగోద్భవ పూజా సమయంలో అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. దీనికి వీఐపీలు కూడా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల మధ్యనే వీఐపీలకు ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తామన్నారు. ప్రత్యేక దర్శనం కోసం ఎటువంటి పాసులూ జారీ చేయడం లేదని షణ్మోహన్ స్పష్టం చేశారు.
ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ, శైవక్షేత్రాల్లో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పిఠాపురం పాదగయ వద్ద భక్తుల రద్దీని అంచనా వేసేందుకు కంట్రోల్ రూము ఏర్పాటు చేసి, దీనికి సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. క్యూల క్రమబద్ధీకరణకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నామన్నారు. శివరాత్రి సందర్భంగా 3 వేల నుంచి 10 వేల మంది వరకూ భక్తులు వచ్చే 15 దేవాలయాలను జిల్లాలో గుర్తించామన్నారు. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో డీఆర్వో టి.తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు.
ఫ సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం
ఫ కలెక్టర్ షణ్మోహన్


