తల్లిదండ్రులను దైవాలుగా భావించాలి
పిఠాపురం: జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ పీఠాలను, ఆలయాలను, గురువులను సందర్శించినా ముక్తి పొందలేరని పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవాలుగా భావించి, గౌరవించాలని సూచించారు. పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండో రోజయిన మంగళవారం పిఠాపురంలోని ఆశ్రమ ప్రాంగణంలో ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి మనిషీ రాక్షసత్వాన్ని వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలని, దీని కోసం ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని అన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చని చెప్పారు. అరిషడ్వర్గాలను స్థాయి పరచుకుంటే అది సాధ్యమవుతుందన్నారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర, సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలను నియంత్రించవచ్చని చెప్పారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని, ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా అశాంతి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చునని ఆలీషా అన్నారు. అనంతరం పీఠం రూపొందించిన పరతత్వ కీర్తనల గ్రంథాన్ని, పీఠం తెలుగు, ఇంగ్లిష్, హిందీ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. సభలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ, కిమ్స్ మెడికల్ కాలేజ్ చైర్మన్ చైతన్యరాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకట రమణ, గిడుగు రామ్మూర్తి మనుమరాలు క్రాంతికృష్ణ తదితరులు కూడా ప్రసంగించారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఫ రాక్షసత్వం వీడి
ఈశ్వరత్వం వైపు పయనించాలి
ఫ డాక్టర్ ఉమర్ ఆలీషా
తల్లిదండ్రులను దైవాలుగా భావించాలి


